జగన్ టార్గెట్‌గా చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్ ఇదే

ఇప్పుడు చంద్రబాబు మరో అంశాన్ని తన ప్రదాన అజెండాగా మార్చుకొని జగన్‌ను టార్గెట్ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

news18-telugu
Updated: December 3, 2019, 3:58 PM IST
జగన్ టార్గెట్‌గా చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్ ఇదే
చంద్రబాబు, జగన్
  • Share this:
ఏపీలో ఇసుక కొరత, ఇంగ్లీష్ మాధ్యమం విషయంలో జగన్ సర్కారును ఇరుకునపెట్టడంలో విజయవంతమైన టీడీపీ అదినేత చంద్రబాబు ఇప్పుడు రాజధాని అమరావతి అంశాన్ని తన ప్రదాన అజెండాగా మార్చుకోబోతున్నారా, నిధుల కొరతతో రాజధాని పనుల విషయంలో జగన్ సర్కారు చూపుతున్న అలసత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎల్లుండి విజయవాడలో అఖిలపక్షంతో రౌండ్ టేబుల్ భేటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నారు.

ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పడ్డాక ఆరునెలలు సమయం ఇద్దామని భావించిన చంద్రబాబు.. సీఎం జగన్ దూకుడు నేపథ్యంలో మనసు మార్చుకున్నారు. అన్నా క్యాంటీన్లతో ప్రభుత్వంతో సమర శంఖారావం పూరించిన చంద్రబాబు. తర్వాత ఇసుక కొరతపై పోరుబాట పట్టారు. ఇసుక కొరత విషయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదని తెలుసుకుని చివరికి ఇసుక దీక్ష కూడా నిర్వహించడం ద్వారా భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా నింపడంతో పాటు టీడీపీని రేసులో నిలిపారు. తాజాగా ఇంగ్లీష్ మాధ్యమంపై జరిగిన చర్చలోనూ తొలుత గట్టిగా మాట్లాడిన చంద్రబాబు... చివరికి సాధారణ ప్రజానీకంలో స్పందన చూశాక వెనక్కి తగ్గారు. అయితే తర్వాత రాజధాని అంశాన్ని అజెండాగా మార్చుకున్న చంద్రబాబు అమరావతిలో ఒక్కరోజు పర్యటించారు. వైసీపీ అనుకూల రైతుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనా, చెప్పులు, రాళ్లు వేసినా వెనక్కి తగ్గకుండా తన పర్యటన పూర్తి చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇవాళ గవర్నర్ హరిచందన్ తో భేటీ అయిన టీడీపీ నేతలు చంద్రబాబు భద్రతను మరోసారి తెరపైకి తెచ్చారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు పర్యటనలో ఆయన బస్సులో రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకుంటే పోలీసులు చోద్యం చూశారని టీడీపీ నేతలు గవర్నర్ దృష్టికి తెచ్చారు.

అంతటితో ఆగకుండా రాజధాని అమరావతి విషయంలో రైతుల్లో నెలకొన్న ఆందోళలను సొమ్ము చేసుకునేలా తదుపరి కార్యాచరణ రచించాలని చంద్రబాబు సిద్దమవుతున్నారు. అందుకే ఎల్లుండి విజయవాడలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో రాజదాని పై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. దీనికి విపక్ష పార్టీలతో పాటు మేథావులను సైతం ఆహ్వానిస్తున్నారు. ఈ భేటీలో రాజధాని భవిష్యత్తుపై చర్చను లేవనెత్తడం ద్వారా స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి గాడిన పడాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో వచ్చే వారం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ దీన్ని ఓ అజెండాగా మార్చాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>