15 రోజుల్లోనే మళ్లీ దీక్ష.. చంద్రబాబు మైండ్ గేమ్ ఇదేనా?

చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత (File)

నారా లోకేష్ దీక్ష చేసిన 15 రోజుల్లోనే చంద్రబాబు కూడా దీక్ష చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఈనెల 14న దీక్ష చేస్తున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 14న ఒకరోజు దీక్ష చేయబోతున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ఒకరోజు దీక్షను చేయనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు నిరసన దీక్ష చేయనున్నారు.

  అక్టోబర్ 30వ తేదీన ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఒక్క రోజు దీక్ష చేశారు. గుంటూరు కలెక్టరేట్ వేదికగా ఆయన నిరాహార దీక్ష చేశారు. టీడీపీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్ దీక్ష చేసిన రెండు వారాల్లోనే మరోసారి చంద్రబాబు దీక్షకు దిగాలని నిర్ణయించుకోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక చంద్రబాబు చాణక్యం ఉందని, పెద్ద రాజకీయ ఎత్తుగడ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై బీజేపీ, టీడీపీ, జనసేన, వామపక్షాలు సహా అన్ని పార్టీలు దీక్షలు చేపట్టాయి. అయితే, ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచేందుకు తన దీక్ష ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇసుక సమస్య రెండు వారాల్లో తీరుతుందని మంత్రులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు దీక్ష తర్వాత రెండు మూడు రోజుల్లోనే ఇసుక సమస్య తీరి.. కార్మికులకు ఉపాధి లభించడం ప్రారంభమైతే.. కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ ఒత్తిడి చేయడం వల్లే ఇలా జరిగిందనే మైలేజ్ వచ్చే అవకాశం ఉంది.

  ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏపీలో టీడీపీ పని అయిపోయిందనే ప్రచారం జోరందుకుంది. వైసీపీ, బీజేపీలో ఈ ప్రచారాన్ని భారీ ఎత్తున చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీని వీడేందుకు చాలా మంది మొగ్గుచూపుతున్నారని చంద్రబాబునాయుడుకు సమాచారం ఉంది. కనీసం ఇసుక కొరత కూడా తీర్చలేని జగన్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అలాంటి వైసీపీ సర్కారులో చేరితే ప్రజాప్రతినిధులను కూడా ప్రజలు ద్వేషిస్తారనే అభిప్రాయం కల్పిస్తే.. టీడీపీని వీడడానికి నేతలు వెనుకడుగు వేసే అవకాశం ఉంది.

  చంద్రబాబునాయుడు దీక్ష చేస్తున్నారంటే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ తప్పకుండా హాజరవుతారు. ఒకవేళ పార్టీని వీడాలని ఎవరైనా కృతనిశ్చయంతో ఉంటే వారు డుమ్మా కొట్టడానికి ఆస్కారం ఉంది. ఆ రోజు సభకు వచ్చిన వారు టీడీపీతో ఉన్నట్టు... ఎవరైతే రారో వారు పార్టీని వీడినట్టే అనే ఓ క్లారిటీ కూడా ఈ దీక్ష ద్వారా చంద్రబాబునాయుడుకు రానుంది.

  వీటన్నిటికంటే ముఖ్యంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిపక్షం ఉవ్విళ్లూరుతోంది. ప్రజా సమస్యల మీద దీక్షలు, ధర్నాలతో నిత్యం ప్రజల్లో ఉంటే కేడర్‌లో ఉత్సాహం నింపినట్టు అవుతుందని టీడీపీ పెద్దలు వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. అందుకే నారా లోకేష్ దీక్ష చేసిన 15 రోజుల్లోనే చంద్రబాబు కూడా దీక్ష చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు.

  పెట్రోల్ సీసాతో రావాలా?.. ఓ రైతు ఆగ్రహం

  Published by:Ashok Kumar Bonepalli
  First published: