చక్రం తిప్పిన చంద్రబాబు... జగన్‌ దూకుడుకు బ్రేక్...

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చక్రం తిప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుకు శాసనమండలిలో బ్రేక్ వేశారు.

news18-telugu
Updated: January 22, 2020, 10:58 PM IST
చక్రం తిప్పిన చంద్రబాబు... జగన్‌ దూకుడుకు బ్రేక్...
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చక్రం తిప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుకు శాసనమండలిలో బ్రేక్ వేశారు. శాసనమండలిలో ఊహించని విధంగా రూల్ నెంబర్ 71ను తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు. చివరకు రాజధాని బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపడంతో చంద్రబాబు వ్యూహం సక్సెస్ అయిందని టీడీపీ నేతలు ఆనందంలో మునిగిపోయారు. ఈ రోజు ఉదయం నుంచి శాసనమండలిలో హైడ్రామా నడించింది. అధికార, విపక్షాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం సాగింది. ఓ రకంగా బూతులు కూడా తిట్టుకున్నారు. ఈ క్రమంలో శాసనసమండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద చర్చ జరిగింది. చివరకు వాటిని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష టీడీపీ, అవసరం లేదని అధికార వైసీపీ మంత్రులు చైర్మన్ మీద ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో శాసనమండలి వాయిదా పడింది.

సాయత్రం 6 గంటల సమయంలో శాసనమండలి వాయిదా పడితే... రాత్రి 9 కి మళ్లీ ప్రారంభమైంది. అప్పటి వరకు చంద్రబాబు శాసనమండలి గ్యాలరీలోనే ఉన్నారు. ఆయన వెంట టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలుకూడా పక్కనే కూర్చున్నారు. మరోవైపు అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా మండలి గ్యాలరీలోనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఎమ్మెల్యే కాదు కాబట్టి బయటకు వెళ్లాలంటూ మార్షల్స్ వచ్చి పంపించే ప్రయత్నం చేయబోగా, ఆయన వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నిన్న, ఈ రోజు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. దీంతో చివరకు మార్షల్స్ వెనుదిరిగారు. సుమారు మూడు గంటల పాటు చంద్రబాబు మండలి గ్యాలరీలోనే కూర్చున్నారు. ఎప్పటికప్పుడు తమ సభ్యులకు సూచనలు అందించారు. అయితే, చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌కు సైగలు చేస్తూ ఆయన మీద ఒత్తిడి తెచ్చారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

తెరవెనుక చంద్రబాబు, తెరముందు యనమల రామకృష్ణుడు ఉండి శాసనమండలిలో వైసీపీ వ్యూహానికి చెక్ పెట్టారని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మినహా 24 మంది మంత్రులు శాసనమండలికి వచ్చి ప్రతిపక్షం మీద ఎదురుదాడి చేసినా వెనక్కి తగ్గకుండా వ్యూహం రచించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్... బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించిన తర్వాత అమరావతి రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. మందడంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబునాయుడు, బాలకృష్ణ కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారు.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు