ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగాలి కాబట్టి, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారని వైసీపీ ఎద్దేవా చేసింది. ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలంటూ టీడీపీ నేతృత్వంలోని 21 పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. గతంలో ఓ సారి పిటిషన్ వేయగా, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అయితే, సగం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించాలంటూ మరోసారి 21 పార్టీలు సుప్రీంకోర్టు గడపతొక్కాయి. అయితే, అందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వైసీపీ నేతలు తమ విమర్శలకు పదును పెట్టారు. గతంలో కూడా చంద్రబాబు కోర్టులకు వెళ్లి అభాసుపాలయ్యారని, ఇప్పుడు కూడా అదే జరిగిందన్నారు. మున్ముందు కూడా చంద్రబాబు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే కాబట్టి, ఇప్పటి నుంచే అలవాటు అవుతుందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుదరదని చెప్పిన తర్వాత కూడా మళ్లీ ఈసీ వద్దకు వెళ్లి పాత పాటే పాడారని విమర్శించారు. మరోవైపు చంద్రబాబునాయుడు నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశంపై కూడా అంబటి విమర్శలు గుప్పించారు.
‘ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. క్యాబినెట్ సమావేశం పెట్టాల్సిన అవసరం, అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది? అలాంటి అవసరం ఉంటే కచ్చితంగా పెట్టవచ్చు. కానీ చంద్రబాబు తన పంతానికి, అధికారులపై సవాళ్ళు విసిరి 10వ తేదీన కేబినెట్ పెడతానని విర్రవీగారు. చివరికి అధికారులు చెప్పినట్టే.. ఈసీ అనుమతి తీసుకునే వరకూ వేచి చూసే పరిస్థితి వచ్చింది. కేబినెట్ మీటింగ్ ను 14కు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబుకు కోడ్ నిబంధనలు తెలియవా?’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. 23వ తేదీ వరకు ఎలాగైనా అధికారం చెలాయించాలనే కుట్రతోనే కేబినెట్ మీటింగ్ పెడతానని చంద్రబాబు ప్రకటించారని, అంతకు మించి ఏమీ లేదని అంబటి అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే విషయం చంద్రబాబుకు తెలిసిపోయిందని అందుకే ఆయన వీవీప్యాట్‌లు, ఎన్నికల కమిషన్ పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అంబటి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Election Commission of India, Lok Sabha Election 2019, Supreme Court