Home /News /politics /

ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు భేటీ.. సీఎం జగన్‌ పాలనపై 14 పేజీల ఫిర్యాదు లేఖ..

ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు భేటీ.. సీఎం జగన్‌ పాలనపై 14 పేజీల ఫిర్యాదు లేఖ..

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో చంద్రబాబు భేటీ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో చంద్రబాబు భేటీ

Chandrababu Naidu meeting AP Governor | ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం మీద 14 పేజీల ఫిర్యాదు లేఖను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు.

    ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కలిశారు. అమరావతిలోని ‘రాజ్‌భవన్‌’లో గవర్నర్‌తో చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం మీద 14 పేజీల ఫిర్యాదు లేఖను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. రాష్ట్రంలో దళితులు, బీసీలు, మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూలదోస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థల పై దాడులు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరిందని, భూకబ్జాలకు అడ్డులేకుండా పోయిందని వివరాలతో సహా లేఖలో పేర్కొన్నారు. కాబట్టి గవర్నర్ చొరవతీసుకుని కూలిపోయిన వ్యవస్థలను పునరుద్ధరించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్టు టీడీపీ తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్టు చేసింది. అలాగే, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను తప్పుడు రికార్డులు సృష్టించి బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చుకున్నారనే ఆరోపణలపై అరెస్టు చేసింది అలాగే, చింతమనేని ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేసింది. ఇక యనమల రామకృష్ణుడు, మాజీ హోంమంత్రి చినరాజప్ప మీద ఓ మహిళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం కుట్రపన్ని బీసీ వర్గాలను టార్గెట్ చేస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    చంద్రబాబునాయుడు హయాంలో తీసుకొచ్చిన మూడు పథకాల మీద సీబీఐ విచారణ జరపాలని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది. ఫైబర్ గ్రిడ్, రంజాన్ తోఫా, చంద్రన్నకానుక, క్రిస్మస్ కానుక పథకాల్లో అవినీతి జరిగిందని కేబినెట్ సబ్ కమిటీ నివేదికను అందజేసింది.  ఫైబర్ నెట్‍లో సుమారు.700 కోట్ల మేర అవినీతి జరిగిందని నివేదికలో ఉపసంఘం స్పష్టం చేసింది. చంద్రన్న రంజాన్ తోఫా,  చంద్రన్న కానుక, క్రిస్మస్ కానుక వంటి స్కీంల ద్వారా రూ.158 కోట్ల అవినీతి జరిగిందని ఉపసంఘం తేల్చింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు ఖర్చు అని తెలిపింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపైనా సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఈ మూడింటి మీద చర్చించిన ఏపీ కేబినెట్ దీనిపై సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, AP governor viswabhushan, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు