CHANDRABABU NAIDU COMMENTS ON ALLIANCE WITH JANASENA CREATES CONFUSION AMONG BJP IN ANDHRA PRADESH AK
AP News: చంద్రబాబు ప్లాన్.. జనసేన హ్యాపీ.. గందరగోళంలో పడిపోయిన ఏపీ బీజేపీ
పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)
AP Politics: రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టేందుకు జనసేనతో పొత్తు అవసరమని భావిస్తున్న టీడీపీ.. బీజేపీతోనూ పొత్తు ఉండాలని కోరుకుంటోందా ? అన్నది మాత్రం తెలియడం లేదు.
రాజకీయాల్లో జరిగే కొన్ని పరిణామాలు అనుకోకుండా జరుగుతాయా లేక ఎవరైనా కావాలనే అలాంటి పరిస్థితులు సృష్టిస్తారా ? అన్నది తెలుసుకోవడం కొంచెం కష్టమే. ఏపీలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆ తరువాత దానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి స్పందన కూడా దాదాపు ఇలాంటిదే. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మళ్లీ దగ్గరవుతాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. అయితే ఓ కార్యకర్త జనసేనతో పొత్తు అంశంపై అడిగిన ప్రశ్నకు చంద్రబాబు(Chandrababu) ఇచ్చిన సమాధానం.. ఆ తరువాత పొత్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనసేనతో (Janasena) పొత్తు కోసం తాము కూడా ఎదురుచూస్తున్నామనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై కొన్ని రోజుల తరువాత స్పందించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. పొత్తులపై నేతలు, కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం ఉంటందని కామెంట్ చేయడం మరింత ఆసక్తి రేపింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కారణంగా ఇబ్బందిపడిన పార్టీ ఏమైనా ఉందా ? అంటే మాత్రం అది కచ్చితంగా బీజేపీనే అని చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ, జనసేన మధ్య ఏపీ రాజకీయాల్లో స్నేహబంధం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని బీజేపీ నేతలు చెబుతుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో స్నేహబంధం కొనసాగించే విషయంలో అంత ఆసక్తిగా లేరనే ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి.
దీనికితోడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ నిరసన దీక్ష చేయడం కూడా బీజేపీ తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చంద్రబాబు జనసేనతో పొత్తు గురించి చేసిన వ్యాఖ్యల తరువాత ఏపీ బీజేపీ గందరగోళంలో పడిపోయిందని ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు కావాలనే బీజేపీ, జనసేన మధ్య స్నేహబంధంపై గందరగోళానికి గురి చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
YS Jagan: సీఎం జగన్ అలా డిసైడయ్యారా ?.. అందుకే చిరంజీవితో సమావేశం జరిగిందా ?
2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. అప్పట్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ రెండు పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టేందుకు జనసేనతో పొత్తు అవసరమని భావిస్తున్న టీడీపీ.. బీజేపీతోనూ పొత్తు ఉండాలని కోరుకుంటోందా ? అన్నది మాత్రం తెలియడం లేదు. మండలి మాజీ చైర్మన్ షరీఫ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి తమకు మిత్రపక్షంగా ఉన్న జనసేనతో స్నేహం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుండటంతో.. ఏపీ బీజేపీ గందరగోళంలో పడిపోయినట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.