CHANDRABABU NAIDU AND NARA LOKESH DECIDED CONTEST AGAIN KUPPAM MANGALAGIRI AK
Andhra Pradesh: చంద్రబాబు, లోకేశ్.. తగ్గేదేలే అని గట్టిగా డిసైడయ్యారా ?
లోకేశ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)
Chandrababu Naidu Nara Lokesh: అటు చంద్రబాబు, ఇటు లోకేశ్.. తమ నియోజకవర్గాల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఫిక్స్ అయ్యారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎవరు అవునన్నా.. కాదన్నా టీడీపీకి అన్నీ చంద్రబాబే. ఆ పార్టీ గెలిచినా.. ఓడినా.. ఆ బాధ్యత చంద్రబాబుదే అని వేరే చెప్పనవసరం లేదు. ఆయన తరువాత పార్టీలో పెత్తనం అంతా ఆయన కుమారుడు, యువనేత నారా లోకేశ్‌దే అని టీడీపీ వర్గాలు బాహాటంగానే చెబుతుంటాయి. ప్రాంతీయ పార్టీలను శాసించే నేతల తరువాత వారి వారసులే ఆ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించడం కొత్తేమీ కాదు. ఇందుకు లోకేశ్ మినహాయింపు కూడా ఏమీ కాదు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత చంద్రబాబు నాయకత్వం.. లోకేశ్ భవిష్యత్తు సారథ్యంపై అనుమానాలు తలెత్తాయి. ఇందులో భాగంగానే టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. అయితే దీన్ని చంద్రబాబు అండ్ కో పెద్దగా పట్టించుకోలేదు.
లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గాన్ని.. గత ఎన్నికల్లోనే ఆయనను ఓడించి రెండోసారి సొంతం చేసుకుంది వైసీపీ. ఇక చంద్రబాబు కంచుకోట కుప్పంలోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ ప్రయత్నాలు గమనించిన చంద్రబాబు.. కుప్పంలో టీడీపీకి జరిగిన డ్యామేజీని సరి చేసేందుకు నేరుగా రంగంలోకి దిగారు. అక్కడి నేతలతో నేరుగా సమావేశమై చర్చలు జరిపారు. కుప్పం నుంచి పార్టీ ప్రక్షాళన మొదలుపెడతానని స్థానిక నేతలకు తెలిపారు. అయితే కుప్పం పరిణామాలతో ఆయన మరో సీటు వెతుక్కుంటారనే ఊహాగానాలు వచ్చాయి. వైసీపీ నేతలు కూడా ఈ మేరకు సెటైర్లు వేశారు.
అయితే ఇటు చంద్రబాబు కుప్పంను, అటు లోకేశ్ మంగళగిరిని వదిలిపెట్టేది లేదని తేల్చేస్తున్నారు. చంద్రబాబు కుప్పంపై ఫోకస్ పెడుతుంటే.. నారా లోకేశ్ మంగళగిరిలో కచ్చితంగా గెలవాలని ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. దీంతో అటు చంద్రబాబు, ఇటు లోకేశ్.. తమ నియోజకవర్గాల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఫిక్స్ అయ్యారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరు నేతలు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పార్టీకి మంచిదే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
చంద్రబాబు, లోకేశ్ ఇలా చేయడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. వైసీపీని ఎదుర్కొనే విషయంలో టీడీపీ శ్రేణులకు ముందు నైతిక బలం అవసరమని.. చంద్రబాబు, లోకేశ్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు, నారా లోకేశ్ తీసుకున్న నిర్ణయం.. టీడీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.