అమిత్ షాను కలవనున్న చంద్రబాబు... కారణం ఇదే ?

ఏపీ ప్రభుత్వం హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న తన నివాసంపై డ్రోన్లను పంపడంపై ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు... ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 18, 2019, 10:28 AM IST
అమిత్ షాను కలవనున్న చంద్రబాబు... కారణం ఇదే ?
అమిత్ షా, చంద్రబాబు
  • Share this:
ఏపీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఎన్నికల ఫలితాల తరువాత ఆ విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోవడం... టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు బీజేపీలో చేరిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీని పూర్తిగా బలహీనపరిచి తమ పార్టీని ఏపీలో బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇంత జరిగినా... బీజేపీని మాత్రం చంద్రబాబు అంతగా విమర్శించడం లేదనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను చంద్రబాబును కలిసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీ ప్రభుత్వం హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న తన నివాసంపై డ్రోన్లను పంపడంపై ఆగ్రహంగా ఉన్న చంద్రబాబు... ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పలువురు టీడీపీ నేతలు సైతం ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారని... ఆయన కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారని సమాచారం. అయితే ఒకవేళ నిజంగానే చంద్రబాబు అమిత్ షాను కలిస్తే... కేవలం డ్రోన్ అంశం మాత్రమే చర్చకు వస్తుందా లేక మళ్లీ రాజకీయాల గురించి చర్చిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా...చంద్రబాబు నిజంగానే అమిత్ షాను కలిస్తే ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు