టీడీపీలో త్వరలో చీలిక... వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు...

news18-telugu
Updated: February 6, 2020, 6:27 PM IST
టీడీపీలో త్వరలో చీలిక... వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు...
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలిక రాబోతోందని వైసీపీ ఎమ్మెల్యే, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు వయసు మీరిపోయింది. అందుకే ఏదోదో మాట్లాడుతున్నారు. త్వరలో టీడీపీలో చీలిక రాబోతోంది. ఆ ఆందోళన ఆయనలో కనిపిస్తోంది.’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు పిచ్చిపట్టినట్టుందని, అందుకే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల మీద ఆధారపడి జీవించే చంద్రబాబునాయుడు జెడ్ ప్లస్ భద్రత లేకుండా ప్రజల్లోకి వెళ్లగలరా అని ప్రశ్నించారు.కియా మోటార్స్ వెళ్లిపోతుందంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధపు వార్తలు రాయించి ఆనందపడుతున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. చంద్రబాబు బతుకు గ్రాఫిక్ బతుకు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసే మంచిపనులు చూడలేక ఇలా బురద జల్లుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓ గూండాలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని... చంద్రబాబుతో చర్చించేందుకు జగన్ అవసరం లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి ఏ పరిశ్రమ కూడా వెళ్లదని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయే కానీ, వెళ్లవన్నారు.

అంతకు ముందు చంద్రబాబునాయుడు సీఎం జగన్ మీద, కియా మోటార్స్ తరలిపోతుందన్న అంశం, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల మీద స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. జగన్‌ పిచ్చి తుగ్గక్‌ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా తగ్గిందని, జగన్‌కు మాత్రం జేట్యాక్స్‌ వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. ఏపీకి రావాల్సిన రూ.1.80 లక్షల కోట్లు పెట్టుబడులు పోయాయని, ఆదానీ డేటా సెంటర్‌, లులు, పేపర్‌ మిల్లు, సింగపూర్‌ కంపెనీలు వెళ్లిపోయాయని బాబు తెలిపారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేశామని, జగన్‌ 9 నెలల పాలనలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్ర యువత భవిష్యత్‌ ఏం కావాలి.. ఇది మీరు చేసిన ద్రోహం కాదా? అని బాబు అన్నారు. మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని విమర్శించారు. తమ హయాంలో దావోస్‌లో ఏపీ పేరు మార్మోగిపోయిందని, ఇప్పుడు దావోస్‌ సదస్సులో ఏపీ ప్రాతినిధ్యమే లేదని మండిపడ్డారు. విశాఖలో మిలీనియం టవర్స్‌లో కంపెనీలను వెళ్లగొట్టి సచివాలయం పెడతారా? అని బాబు ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ సంస్థ తమిళనాడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉందంటూ రాయిటర్స్ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. జగన్ ప్రభుత్వం, కియా మోటార్స్ మధ్య వివాదం నడుస్తోందనే వాదన తెరపైకి వచ్చింది. అయితే, ఈ వాదనను ప్రభుత్వం ఖండించింది. కియా మోటార్స్, ప్రభుత్వం సంయుక్తంగా కలసి నడుస్తున్నాయని, ఎలాంటి వివాదాలు లేవని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 6, 2020, 6:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading