ఛలో కత్తిపూడి సభకు కాపు నేత ముద్రగడ పద్మనాభం పిలుపు ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలో టెన్షన్ మొదలయ్యింది. దీంతో జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో గత రెండు రోజుల నుండి పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సోమవారం కిర్లంపూడిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ నెల 31న ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘ఛలో కత్తిపూడి’ సభకు పోలీసుల అనుమతి లేదని ఎస్పీ విశాల్ గున్ని స్పష్టంచేశారు. ఈ సభ కోసం ముద్రగడ పద్మనాభం పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
పోలీసు శాఖ అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ హెచ్చరించారు. జిల్లాలో జరిగిన వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ యాత్రలతో పాటు రాజమండ్రి బీసీ సభ ఇలా అన్నీ కూడా పోలీసుల అనుమతితోనే జరిగాయని తెలిపారు. ఛలో కత్తిపూడి సభకు అనుమతి కోరితే పరిశీలిస్తామని చెప్పారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా నిర్వహించే సభలకు వెళ్లి ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.