Home /News /politics /

CENTRAL VS STATE WAR YCP SUSPECTS ON UNION FINANCE MINSTER TOURS OF ANDHRA PRADESH NGS GNT

State Vs Central: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ కి కారణం ఎవరు? రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందుల వెనుక ఆయన హస్తం ఉందా?

కేంద్రంతో ఏపీ సర్కార్ ఢీ

కేంద్రంతో ఏపీ సర్కార్ ఢీ

ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి గ్యాప్ రావడానికి అదే కారణమా..? ఆ వివాదాల వెనుక ఆయన హస్తం ఉందా.. ఆయన సూచనల ప్రకారమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏపీలో పర్యటిస్తున్నారా..?

  అన్నా రఘు అమరావతి ప్రతినిది న్యూస్,       మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు మారింది ఏపీ-కేంద్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం. అవసరం లేకపోయినా ప్రతి విషయంలో కేంద్రాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది ఏపీ ప్రభుత్వం. అడక్కుండానే ముందుగానే మద్దతు ప్రకటించేది. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా.. బడ్జెట్ లో రాష్ట్రం పేరు ప్రస్తావించకపోయినా.. విభజన హామీల ఊసు ఎత్తకపోయినా.. కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనేది కాదు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీని విమర్శించడం తప్ప.. బీజేపీ నేతలు విమర్శలు చేస్తూన్నా వైసీపీ నేతలు పట్టించుకునే వారు కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. అడక్కుండానే అనేక విషయాల్లో కేంద్రానికి మాటసాయం చేసిన వైసీపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నానాయాగీ చేస్తోంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంతో ఎంత సఖ్యతగా మెలుగుతున్నప్పటికీ తమ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా బీజేపీ పెద్దలు పెడచెవిన పెట్టడాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

  ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో రాష్ట్రం సతమతమౌతుంటే అందుకోవలసిన కేంద్రం ఆర్ధిక పరమైన ఆంక్షలు మరింత కఠినతరం చేయడంతో వైసీపీ ప్రభుత్వానికి మరింత ఆగ్రహం కలిగేలా చేస్తున్నాయి అనడంలో అస్సలు సందేహం లేదు. వీటన్నింటికి మించి ఉన్న ఫళంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఆకస్మిక రాష్ట్ర పర్యటన వైసీపీ వర్గాలను మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఆమె పర్యటనలోని ఆంతర్యం అర్ధం కాక వైసీపీ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయి. అత్తల్లు అయిన ఆంధ్ర రాజకీయాల పట్ల ఆమెకు అవగాహన కలిగి ఉండటం తోనే. ఆమెను కేంద్ర పెద్దలు ఇక్కడికి పంపి ఉండవచ్చనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏవిధమైన అధికారిక కార్యక్రమాలు లేకుండానే కేంద్ర మంత్రి వరుస పర్వటనలపై.. రాష్ట్ర అధికార పార్టీని కలవర పాటుకు గురి చేస్తున్నాయి..

  మొన్న పొందూరు వచ్చిన ఆమె ఇప్పుడు నరసాపురం పర్యటనకు వస్తుండడంపై  వైసీపీ వర్గాలను కలవరపడేలా చేస్తున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు హవా తెలుసుకునేందుకే ఆమె వ్యక్తిగత పర్యటన పేరుతో నరసాపురం వెళ్ళారు అనేది అధికార పార్టీ నేతల వాదన. ఇక రాష్ట్రం పట్ల ఆర్ధిక మంత్రి ఖరాఖండిగా వ్యవహరిస్తున్న ఆమె వైఖరిపైనా అనుమానాలు పెరుగుతున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఆమె భర్త పరకాల ప్రభాకర్ ప్రభావం ఉందని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. గడచిన రెండున్నరేళ్ళ కాలంలో ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన టీడీపీ ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్ళలేక పోయాయి అనేది వాస్తవం. కానీ గత నెల రోజులుగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై,రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై టీడీపీ విజయవంతంగా ప్రజల ముందుకు వెళ్ళగలిగిందనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి కారణం జగన్ అనుభవరాహిత్యమేనని ప్రజలను నమ్మించడంలో టీడీపీ పూర్తిగా విజయం సాధించింది. ఇప్పుడు ఇదే అదునుగా జగన్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టడానికే కేంద్రమంత్రి పర్యటనల ఉద్దేశమని అధికార పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నారు.

  చంద్రబాబు కనుసన్నల్లో పరకాల ప్రభాకర్ సూచనల మేరకు నిర్మల సీతారామన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని వైసీపీ వర్గాల అనుమానం. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రాబోయే ఎన్నికల నాటికి జగన్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టవచ్చనే అనుమానాలు బీజేపీలోని ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే జగన్ ఎలాగూ తమ గూటికి వచ్చే అవకాశం లేదు కనుక అతన్ని ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టి తమ దారికి తెచ్చుకోవాలనేది బీజేపీ పన్నాగం కావచ్చని అంటున్నారు. అందుకే జగన్ ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చినా  కేంద్ర పెద్దల అనుగ్రహం మాత్రం దక్కడంలేదు అని ఢిల్లీ వర్గాల సమాచారం. పైగా రేపటి రోజున బీజేపీ-టీడీపీ జతకట్టే పరిస్థితి వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా జగన్ బలాన్ని ఇప్పటి నుండే తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలు కేంద్రం అప్పుడే మొదలు పెట్టిందనే చెప్పాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై జగన్ సర్కార్ కొంత ధిక్కారధోరణి విస్తుంది. దీనికి కొనసాగింపే అమిత్ షా శ్రీశైలం పర్యటనలో ముఖ్య మంత్రి జగన్ పాల్గోనక పోవడం అని ప్రచారం జరుగుతోంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Politics, Central governmennt, MP raghurama krishnam raju, Nirmala sitharaman

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు