స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మనసు మారే పరిస్థితి కనిపించడం లేదు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడానికి ఉన్న షాకులన్నీ కేంద్ర మంత్రులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కు ఉద్యమం ఎగసిపడుతున్నా.. కేంద్రం లైట్ తీసుకుంటోంది. అందుకే వంద శాతం ప్రైవేటీకరణ తప్పదనే అంశంలోనే మాట్లాడుతోంది. తాజాగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చెప్పిన సమాధానం కూడా అలాంటిదే..
రాజ్యసభ చర్చలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రశ్నించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కేంద్రమంత్రి జవాబిచ్చారు. దేశంలో ఉక్కు పరిశ్రమలు కోకింగ్ కోల్ కొరతను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశంలో కోకింగ్ కోల్ కొరత కారణంగా ఉక్కు పరిశ్రమలు విదేశాల నుంచి కోల్ దిగుమతి చేసుకుంటన్నట్లు ఆయన వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత బొగ్గు గనులు కేటాయించే పరిస్థితి లేదని పరోక్షంగా స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్‌లలో తక్కువ బూడిద పరిణామం కలిగిన కోకింగ్ కోల్‌ను మాత్రమే వినియోగిస్తారని, మన దేశంలో శుభ్రపరచని కోకింగ్ కోల్‌లో బూడిద సగటున 22 నుంచి 35 శాతం ఉంటుందన్నారు. సాంకేతికంగాను, పర్యావరణ పరిరక్షణ పరంగాను స్టీల్ ప్లాంట్‌లలో వినియోగించే కోకింగ్ కోల్‌లో బూడిద 10 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలని కేంద్రమంత్రి తెలిపారు. అందుకే ఉక్కు కంపెనీలు తమకు అవసరమైన లోయాష్ కోకింగ్ కోల్‌ను అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని మంత్రి చెప్పారు. దేశంలో వివిధ స్టీల్ ప్లాంట్లకు ప్రభుత్వం కేటాయించిన సొంత బొగ్గు గనుల వివరాలను మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. 2015 లో గనులు, ఖనిజాల చట్టం సవరించిన అనంతరం ఇ-ఆక్షన్ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులు జరుగుతున్నట్లు చెప్పారు.
అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకిరణకు అంగీకరించేది లేదని రాజ్యసభలో స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయిరెడ్డి. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్ని పునరుజ్జీవానికి ప్రణాళిక రూపొందించడానికి బదులు ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూడడం తగదంటూ కేంద్ర ప్రభుత్వ తీరును నిలదీశారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఈ కామెంట్స్ చేశారు విజయ సాయి రెడ్డి. ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పని చేస్తాయన్నారు. అందు వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కానీ... ప్రైవేట్ రంగ సంస్థలు లాభార్జనే ధ్యేయంగా నడుస్తాయన్నారు. అందు వల్ల కొద్ది మందికే ఉపాధి లభిస్తుందన్నారాయన. ముందుగా ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయించగా మిగిలిన వాటిని మాత్రమే ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని సూచించారు విజయ సాయి రెడ్డి. అంతేకాదు... నిర్ణీత కాలపరిమిలో రాష్ట్ర ప్రభుత్వం గనుల వేలం వేయలేకపోతే... వాటిని వేలం వేసే హక్కు కేంద్రం పొందేలా బిల్లులో ప్రతిపాదించారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమన్నారు విజయ సాయి రెడ్డి. ఏదీ ఏమైనా మరోసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం స్సష్టమైన సంకేతాలు ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Rajya Sabha, Vijayasai reddy, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant