‘ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోం’.. పోలవరంపై ఏపీకి కేంద్రం హెచ్చరిక

‘పోలవరం నిర్మాణం బాధ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. పోలవరంపై తీసుకునే ప్రతి నిర్ణయమూ కేంద్రానికి చెప్పాల్సిందే.’ అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 6:07 PM IST
‘ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోం’.. పోలవరంపై ఏపీకి కేంద్రం హెచ్చరిక
జగన్, మోదీ
  • Share this:
పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారును తప్పుపట్టింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పోలవరం నిర్మాణం బాధ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. పోలవరంపై తీసుకునే ప్రతి నిర్ణయమూ కేంద్రానికి చెప్పాల్సిందే. డబ్బులు చెల్లించేది కేంద్రమే కాబట్టి అన్నీ చెప్పే చేయాలి. రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు చేస్తే కేంద్రం ఊరుకోదు.’ అని షెకావత్ హెచ్చరించారు. తాము చేసే పనులు అన్నిటికీ నరేంద్ర మోదీ, అమిత్ షా ఆశీస్సులు, సూచనలు ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గజేంద్ర సింగ్ షెకావత్ కౌంటర్ ఇచ్చారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవన్నారు. రాష్ట్రం, కేంద్రం ఎవరి పని వారు చేసుకుంటూ పోవాల్సిందేనన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ అంశానికి సంబంధించి అధారిటీ నుంచి నివేదిక కోరామని షెకావత్ చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

తెలుగుదేశం సమయంలో ప్రాజెక్టులకు సంబంధించి భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎక్కువ ధరలకు ప్రాజెక్టులను కట్టబెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, దీనిపై పోలవరం కాంట్రాక్టర్ నవయుగ సంస్థ హైకోర్టుకు వెళ్లడంతో దానిపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. మరోవైపు ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ మోదీ, అమిత్ షాతో చెప్పే చేస్తోందని, తమకు వారిద్దరి ఆశీస్సులు ఉన్నాయని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు