ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi)పంజాబ్ (Punjab)పర్యటనలో భద్రత వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటోంది కేంద్రం. కాదు చివరి నిమిషంలో ప్రధాని రోడ్డు మార్గం గుండా వెళ్లాలని నిర్ణయించడం వల్లే ఇలా జరిగిందని పంజాబ్ సర్కారు సమర్దించుకుంటోంది. ఈవిషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికి ప్రధాని పర్యటనలో భద్రత వైపల్యంపై సుప్రీం కోర్టు(Supreme court)లో దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం సైతం అంగీకరించింది. దీనిపై శుక్రవారం విచారించనుంది. మరోవైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(President ram nath kovind)తో జరిగిన భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అంశంపై చర్చించారు. పంజాబ్ పర్యటనలో ఎదుర్కొన్న పరిస్థితులను ఆయనకు వివరించడంతో రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu)సైతం ప్రధానితో చర్చించారు. అనంతరం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్, ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీల సమావేశంలో చర్చించారు. ప్రధాని పర్యటనలో భద్రత వైఫల్యంపై కేంద్ర హోంశాఖ (Central Home Ministry)సైతం వివరాలు సేకరిస్తోందన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag thakur). వివరాలు బయటకు వచ్చిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath singh)సైతం పంజాబ్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రధాని లాంటి వ్యక్తులకే భద్రత కల్పించలేకపోతే ఎలా ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో కూడా ఇలాంటి నీచరాజకీయాలు చూడలేదని మండిపడ్డారు.
భద్రత వైఫల్యంపై మాటల యుద్ధం..
ప్రధాన మంత్రి పర్యటనలో భద్రత వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం వాదన ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందులో తమ పోరపాటు ఏమాత్రం లేదంటోంది. ప్రధాని కాన్వాయ్ రోడ్డుమార్గంలో వెళ్తున్నట్లు తమ ప్రభుత్వానికి సమాచారం అందలేదని ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ తెలిపారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం చన్నీ ప్రధాని టూర్లో జరిగిన పొరపాట్లపై విచారణకు ఓ కమిటీని కూడా వేసింది. మూడ్రోజుల్లో పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇంతటి దారుణం ఎక్కడైనా ఉంటుందా..
ప్రధాని పర్యటనలో భద్రత వైఫల్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన మంత్రికి భద్రత కల్పించలేకపోవడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడంతో సమానం అంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలోని 130 కోట్ల మందికిపైగా ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రధానిపై జరిగిన దాడిని దేశంలో ప్రతి ఒక్కరిపై జరిగిన దాడిగా చూడాలన్నారు. ఇన్స్‌స్టాలో పోస్ట్ పెడుతూ ప్రధానికి తన మద్దతు తెలియజేశారు కంగనా రనౌత్. పంజాబ్ ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరంగా మారుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిని ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కంగనా రనౌత్ తన పోస్ట్ ద్వారా ఘాటుగా స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PM Narendra Modi, Punjab, Security