Political fight: కేంద్రంతో జగన్ సర్కార్ ఢీ.. హస్తినలో హోదా హీట్.. వైఖరి మార్పుకు కారణం అదే

ప్రధాని మోదీ, సీఎం జగన్

కేంద్రంతో ఇంతకాలం మంచి సంబంధాలు నెరిపిన వైసీపీ తన రూటు మార్చిందా..? ఇక కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలి అనుకుంటోందా..? గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏదో అయ్యిందనే ప్రచారం ఉంది. లేక ఆ విషయం తెరపైకి రాకుండా ఉండేందుకే వైసీపీ కొత్త డ్రామాలకు తెరలేపిందా..?

 • Share this:
  మరుగున పడింది అనుకున్న ప్రత్యేక హోదా నినాదాన్ని వైసీపీ మళ్లీ తెరపైకి తెచ్చింది. కేంద్రం ఇస్తే తీసుకుంటాం.. ప్రతిసారి అడగడం తప్ప ఏం చేయాలేమని హోదా విషయంలో గతంలో సీఎం జగన్ చేతులెత్తేశారు. కేంద్రం కూడా పదే పదే ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ కూడా దాదాపు ఇక హోదా లేనట్టే అనే నిర్ణయానికి వచ్చేసింది. కానీ అకస్మాత్తుగా హోదా నినాదాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా గత రెండేళ్ల నుంచి ఏపీ సర్కార్ పద్ధతి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ప్రతి విషయంలో మద్దతు ఇస్తూనే ఉంది. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్ధిస్తూనే ఉంది. అంతెందుకు ఇటీవల కరోనా విరుచుకుపడుతున్న సమయంలో సైతం ప్రధాని మోదికి సీఎం జగన్ మద్దతుగా నిలిచారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కలిసి రావాలంటూ లేఖలు రాశారు. ఇలా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం మధ్య సత్ససంబంధాలే ఉన్నాయి. ఏపీ -తెలంగాణ మధ్య జలవివాదంలో ఏపీ ప్రభుత్వం లేఖ ఆధారంగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో బంధం మరింత బలపడాలి.. కానీ అనూహ్యంగా కనిపిస్తోంది పరిస్థితి.. ఏపీకి కేంద్రం అన్ని విషయాల్లో మొండిచేయి చూపిస్తున్నా ఎప్పుడూ పల్లెత్తు మాట అనని వైసీపీ ఇప్పుడు కేంద్రంపై దూకుడు పెంచింది.. మొన్నటికి మొన్న ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.. నిన్న మంత్రి కొడాలి నాని సైతం టీడీపీని బీజీపీలో విలీనం చేస్తున్నారంటూ విమర్శించారు. అంటే కేంద్రంతో వైఖరి విషయంలో వైసీపీ స్ట్రాటజీ మార్చిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  అందుకు నిదర్శనంగా ఇంతకాలం హోదా విషయంలో సైలెంటుగా ఉన్న వైసీపీ ఇప్పుడు హోదా విషయంలో కేంద్రంతో పోరాటానికి సిద్ధమైంది. ఏపీకి హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్‌ 267 కింద ఆయన ఈ నోటీసు ఇచ్చారు. అక్కడితోనే ఆగలేదు.. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఛైర్మన్‌ పోడియం దగ్గరకు ఎంపీలు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. అది కూడా ప్రధాని మోదీ సభలో ఉన్నప్పుడే నిరసనగళం వినిపించారు. వైసీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అటు లోక్ సభలోనూ అదే పరిస్థితి కనిపించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ వైసీపీ ఎంపీలు నినాదలు చేయడంతో సభ గందరగోళంగా మారింది..

  తాజా పరిణమాలు చూస్తుంటే.. కేంద్రానికి-వైసీపీకి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు నిదర్శనమే ఇటీవల విజయసాయి రెడ్డి, మంత్రి కొడాలి వ్యాఖ్యలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. దానికి తోడు రఘురామ రాజు అంశంలో స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా ఒక కారణమై ఉంటుందని భావిస్తున్నారు. అయితే వైసీపీ ఎంపీల ఆందోళనల వెనుక వేరే కారణం ఉంది అంటున్నారు. ఎంపీ రఘురామ రాజు అంశం చర్చకు రాకుండా ఉండేందుకే వైసీపీ ఎంపీలు ఇదంతా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నాటికే ఆయనపై వేటు పడుతుందని ఆశించారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ సభా కార్యక్రమాలు సజావుగా సాగి.. ఆయన తనను పోలీసులు హింసించారనే అంశాన్ని చర్చకు తెస్తే.. వైసీపీకి జాతీయ స్థాయిలో డామేజ్ తప్పదు. అందుకే ఆ అంశం సభలో చర్చకు రాకుండా ఉండేందుకు వైసీపీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారనే మరో వాదన ఉంది..
  Published by:Nagesh Paina
  First published: