మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో అత్యవసరంగా సమావేశమైంది. ఈ కేబినెట్లో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి సూచన మీద సమాలోచనలు జరిపారు. అనంతరం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతకు ముందు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆ మేరకు అంగీకారం తెలిపింది.
అయితే, ఈ రోజు రాత్రి 8.30గంటల లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే తమకు తెలపాలంటూ మహారాష్ట్ర గవర్నర్ ఎన్సీపీకి గడువు ఇచ్చారు. ఆ గడువు ముగియకముందే కేంద్రం రాష్ట్రపతి పాలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఒకవేళ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని శివసేన యోచిస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఓ రెండు రోజులు గడువు కావాలని శివసేన ప్రతినిధులు గవర్నర్‌ను కలసి నిన్న విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ వినతిని గవర్నర్ తోసిపుచ్చారు. అనంతరం ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు.