‘ఆపరేషన్ కమల’పై కూడా సీబీఐ దర్యాప్తు జరపండి: సిద్ధరామయ్య

CBI Probe on Phone Tapping Case | టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్కటే కాదు జేడీఎస్-కాంగ్రెస్ సర్కారును కూల్చేసేందుకు బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ కమల’పై కూడా సీబీఐ విచారణ జరిపించాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: August 19, 2019, 10:33 AM IST
‘ఆపరేషన్ కమల’పై కూడా సీబీఐ దర్యాప్తు జరపండి: సిద్ధరామయ్య
మాజీ సీఎం సిద్దరామయ్య(Photo: Getty Images)
  • Share this:
కర్ణాటక రాజకీయాలను టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప ఆదివారం ప్రకటించారు. కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు పలువురు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు, పోలీసు అధికారులు, పాత్రికేయులు, ప్రముఖ వాణిజ్యవేత్తలు, సినీ తారలు ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సీసీబీ జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ అందించిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు యడియూరప్ప తెలిపారు.

ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు మరికొందరు సొంత పార్టీ(జేడీఎస్) నేతల ఫోన్లను కూడా కుమారస్వామి ట్యాపింగ్ చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ యడియూరప్ప నిర్ణయం తీసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో కలకలంరేపుతోంది. మాజీ సీఎం కుమారస్వామిని ఇరుకున పెట్టే ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు ఆదేశించారని జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించడంపై మాజీ సీఎం సిద్ధరామయ్య ఆచితూచి స్పందించారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాదు...ఆపరేషన్ కమల‌పైనా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సీబీఐని బీజేపీ స్వార్థ ప్రయోజనాల కోసం కీలుబొమ్మలా వాడుకుందని ఆరోపించారు. ప్రస్తుతం టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం వెనుక కర్ణాటక బీజేపీకి ఎలాంటి స్వార్థ దురుద్దేశాలు లేవని భావిస్తున్నట్లు చెప్పారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు