Vizag Steel Plant:అలా చేస్తే లాభాల్లోకి తేవొచ్చు.. విశాఖ ఉక్కుపై జేడీ కీలక సూచనలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జేడీ సూచనలు

విశాఖ ఉక్కును లాభాల పట్టించే అవకాశాలు ఉన్నాయని పలు సూచనలు చేస్తూ ప్రధానికి లేఖ రాశారు సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ. వాటిని అమలు చేస్తే మళ్లీ పూర్వవైభవం తీసుకురావచ్చని తెలిపారు. దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడాలని కోరారు.

 • Share this:
  ఏపీ వ్యాప్తంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం ఉద్ధృతం అవుతోంది. దాదాపు నెల రోజులుగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయా పార్టీలు అన్ని ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. కానీ ఏకతాటిపైకి రావడం లేదు. దీంతో రాజకీయ పార్టీల వెంట వెళ్లడం కాన్నా.. తామే రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఉక్కు జేఏసీ భావిస్తోంది. దీన్ని జాతీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లడానికి కార్మిక సంఘాలు కార్యాచరణపై దృష్టిసారించాయి.

  విశాఖ ఉక్కు పరిశ్రమలోని 100 శాతం వాటాలను అమ్ముతున్నట్లు ఈ నెల 8న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రకటించడంతో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. ఆ వెంటనే ఆందోళనకారులు పోరాట పంథాను మార్చారు. ఆ రోజు రాత్రి నుంచే విరామం లేని పోరాటం చేస్తున్నారు కార్మికులు. విశాఖ నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధం చేశారు. ఫలితంగా జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. అర్ధరాత్రి వరకూ నిరసన కొనసాగింది. తొమ్మిదో తేదీన పరిపాలనా కార్యాలయం ముట్టడిని భారీ స్థాయిలో నిర్వహించారు. 10వ తేదీన జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఒక రోజు విరామమిచ్చినా మళ్లీ ముందడుగేశారు. ఇప్పటికే యాజమాన్యానికి ఉక్కు అఖిల పక్ష యూనియన్లు సమ్మెనోటీసులు ఇచ్చాయి. 25వ తేదీ తర్వాత ఏ రోజైనా సమ్మెలో పాల్గొంటామని స్పష్టం చేశారు కార్మిక నేతలు..

  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఈనెల 15న అడ్మిన్‌ భవన్‌ దగ్గర మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే 16,17 తేదీల్లో పోరాట సమితి ఆధ్వర్యంలో అఖిల పక్షం ఢిల్లీ వెళ్లాలన్న కార్యాచరణతో అడుగులు ముందుకు వేస్తోంది. 20వ తేదీన ఉక్కు తృష్ణా మైదానంలో ఉక్కు పరిరక్షణ గర్జన పేరుతో బహిరంగ ఏర్పాట్లపై సమాలోచనలు జరుపుతున్నారు. ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టాలని తాజాగా నిర్ణయించడంతో ఉద్యమం మరోస్థాయికి చేరుతుందని, కేంద్రం తప్పనిసరిగా ఆలోచన చేస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  ఇలా ఉక్కు ఉద్యమం ఉద్ధృతం అవుతున్న సమయంలో మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అంతేకాదు ప్రధానికి పలు సూచనలు చేస్తూ లేఖ రాశాను అన్నారు. వాటిని అమలు చేస్తే మళ్లీ పూర్వవైభవం తీసుకురావచ్చని తెలిపారు. దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడాలని అన్నారు. సముద్రతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖే అని ఆయన తెలిపారు. ఎగుమతి, దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనన్నారు.  రానున్న కాలంలో స్టీల్‌కు డిమాండ్ పెరగనుందని.. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు.

  ఇదీ చదవండి: బావమరిది బాటలోనే బావ: తెలంగాణ రాజకీయాలను తాకిన విశాఖ ఉద్యమ సెగ?

  ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో దేశానిది రెండో స్థానమన్న ఆయన.. స్టీల్ పరిశ్రమలను ప్రయివేటీకరిస్తే… సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందన్నారు. ధరలన్నీ కంపెనీ వాళ్ల చేతుల్లో ఉంటాయని హెచ్చరించారు. రేపటి రోజున స్టీల్ కొనడం కష్టంగా మారుతుందన్నారు. సర్దార్ పటేల్ విగ్రమానికి 3200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2200 టన్నులను విశాఖ నుంచే పంపారన్నారు. మిగిలిన స్టీల్ కంటే ఇది నాణ్యమైనదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్‌తో వ్యవసాయరంగం అభివృద్ధి అయ్యేలా చేశారని, అలాగే బిలాయ్ లాంటి ఉక్కు పరిశ్రమలతో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చారని వివరించారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకు రావొచ్చని అభిప్రాయపడ్డారు. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని సూచించారు. నిపుణుల సలహాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రానికి పంపనున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపారు.

  మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 29వ రోజుకు చేరాయి. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు రిలే దీక్షలకు సంఘీ భావం తెలిపారు. సినీ నటుడు శివాజీ దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు ప్రకటించారు.
  Published by:Nagesh Paina
  First published: