CANDIDATES DISTRIBUTING SILVER ORNAMENTS TO VOTERS IN ANDHRA PRADESH MUNICIPAL ELECTIONS FULL DETAILS HERE PRN
AP Municipal Elections: వెండి పట్టీలు, ఉంగరాలు, ముక్కుపుడకలు.. ఓట్ల కోసం కోటి గిప్టులు
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల్లో (AP Muncipal Elections) ప్రలోభాలు జోరుగా సాగుతున్నాయి. డబ్బులు (Money), మద్యం (Liquor)తో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలు జోరుగా సాగుతున్నాయి. డబ్బులు, మద్యంతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు నచ్చిన., వారు మెచ్చిన వస్తువులను పంపిణీ చేసేస్తున్నారు. డబ్బుల విషయంలో అభ్యర్థులు చాలా పక్కాగా వ్యవహరిస్తున్నారు. ముందు కొంత అడ్వాన్స్ గా చెల్లించి పోలింగ్ దగ్గర పడ్డాక మరింత సొమ్ము ముట్టజెబుతున్నారు. అంతేకాదు టోకెన్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఓటర్లను దారిలోకి తెచ్చుకునేందుకు స్పెషల్ టీములను కూడా అభ్యర్థులు నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.2వేల వరకు పంచుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలో అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్ధికంగా బలంగా ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటం లేదు.
ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చీరలు, జాకెట్ ముక్కలు పంపిణీ చేస్తున్నారు. అందులో డబ్బులు అదనంగా పంచిపెడున్నారు. కడప జిల్లాలోని కడప కార్పొరేషన్, ప్రొద్దటూరు లాంటి పట్టణాల్లో చీరలతో పాటు వెండి కుంకు భరిణేలు, వెండి పట్టీలు, బంగారు ముక్కుపుడకలను పంపిణీ చేస్తున్నారు. ప్రొద్దటూరులో బంగారం, వెండి వ్యాపారులు ఎక్కువగా ఉండటంతో అభరణాల పంపిణీకే మొగ్గుచూపుతున్నారు. మహిళలకు వెండి పట్టీలు, పురుషులకు వెండి ఉంగరాలు పంచుతునట్లు తెలుస్తోంది. దీంతో బంగారు, వెండి వ్యాపారులకు గిరాకీ పెరిగింది. కొందరు ఓటర్లకు టోకెన్లు ఇచ్చి వ్యాపారుల దగ్గర ఆభరణాలు కలెక్ట్ చేసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ లావాదేవీలన్నీ చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయి.
వీటితో పాటు ఓటర్లు ఎక్కువగా ఉంటే వారికి పెద్దపెద్ద గిఫ్టులు ఆఫర్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ఎక్కువ ఓట్లన్న ఓ కుటుంబానికి ఎల్ఈడీ టీవీ కొనిచ్చేలా ఓ అభ్యర్థి ఒప్పందం చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలోని ఓ మున్సిపాలిటీతో పాటు విజయవాడ కార్పొరేషన్లో మహిళలకు కుక్కర్లు, మిక్సీలతో పాటు వెండి కుంకుమ భరిణెలు పంచుతున్నట్లు సమాచారం. దీంతో నగరంలోని కుక్కర్, మిక్సీల షాపుల్లో అమ్మకాలు భారీగా పెరిగాయి.
కార్లు, ప్రయాణ ఖర్చులు
ఇక చాలా పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వెనుకాడటం లేదు. అభ్యర్థులు వారికి ఫోన్ చేసి స్పెషల్ కార్లు, ప్రయాణ ఖర్చులు ఇచ్చి ఓటు వేసేందుకు స్వస్థలాలకు రప్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రావడానికి కారు.. వచ్చిన తర్వాత ఆతిథ్యం.. తిరిగి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు ఇచ్చి పంపేలా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటు వేసేందుకు వచ్చిన వారికి విందులు ఏర్పాటు చేశారు.
ఎన్నికల్లో నగదు ప్రవాహం అధికంగా ఉండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు నగరాల్లో స్పెషల్ ఐటీ టీములు రంగంలోకి దిగాయి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.