రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షలు చేయవచ్చా? చేయకూడదా? అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి, ఎన్నికలు అయిపోయాక సమీక్షలు చేయవచ్చని టీడీపీ వాదిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా..ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవని సాక్షాత్తూ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టం చేశారు. దీంతో టీడీపీ మంత్రులు - సీఈవో ద్వివేదీ, చీఫ్ సెక్రటరీలతో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అనేది ఒకటే. అది అందరికీ ఒకేలా వర్తిస్తుంది. అయితే, ఒకే ఎన్నికల కోడ్‌ను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటుంటే, ఈసీ మాత్రం తమకు అనుకూలంగా వాదిస్తోంది. మరోవైపు ఎన్నికల కోడ్ అందరికీ సమానం అయినప్పుడు ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా ఎందుకు అమలు చేస్తున్నారని టీడీపీ వాదిస్తోంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్షలు చేయడానికి వీలు లేకపోతే, మరి అదే కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి కేబినెట్ సమావేశం ఎలా పెడతారని, భద్రతాధికారులతో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఢిల్లీ వరకు అవసరం లేదని, పొరుగున ఉన్న తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అక్కడి ముఖ్యమంత్రి సమీక్షలు జరిపారని వాదిస్తోంది.
ఎన్నికల కోడ్ విషయంలో రాజకీయ పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి. రాజకీయ ప్రయోజనాల కోసం వారు వాదించడంలో తప్పు లేదు. కానీ, ప్రజాసేవ చేయడానికి కంకణబద్ధులైన అత్నున్నత స్థాయి ఐఏఎస్ అధికారుల్లో కూడా విభజన రావడం ఏపీలోనే జరుగుతోంది. అక్కడి ఐఏఎస్ అధికారులు కూడా రెండు వర్గాలుగా విడిపోయినట్టు కనిపిస్తోంది. ఒకరు ఒక పార్టీకి, మరొకరు మరో పార్టీకి మద్దతుగా నిలుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకొందరు పార్టీలతో పనిలేకుండా తమ పని తాము చేసుకుంటూ పోయేవారు కూడా ఉన్నారు.
కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సమీక్షలు చేయొచ్చా? చేయకూడదా? అనే విషయంలో రాజ్యాంగ, న్యాయ నిపుణులు కూడా రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. దీంతో అసలు నిబంధన ఏంటనేది ప్రజలకు అర్థంకాక గందరగోళంలో పడుతున్నారు.
ఇది కూడా చూడండి :-
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.