హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. రోప్ బ్రిడ్జి..

ప్ర‌స్తుతం మ‌న దేశంలో కోల్‌కతాలోని రవీంద్రసేతు, ఇత‌ర ప్రాంతాల్లో ఒకటి రెండు మాత్రమే రోప్‌ బ్రిడ్జ్‌లు ఉన్నాయి. అవి కూడా చాలా చిన్న ప‌రిమాణాల్లో క‌ట్టినవే.

news18-telugu
Updated: June 26, 2019, 5:47 PM IST
హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. రోప్ బ్రిడ్జి..
దుర్గం చెరువు వద్ద కట్టబోయే రోప్ బ్రిడ్జి నమూనా
news18-telugu
Updated: June 26, 2019, 5:47 PM IST
హైద‌రాబాద్ అంటేనే మ‌నంద‌రికి ట‌క్కున గుర్తొచ్చేది చార్మినార్, హైటెక్ సిటీ. అంత‌లా ఈ క‌ట్ట‌డాలు న‌గ‌రానికి గుర్తింపు తెచ్చాయి. అయితే ఇప్పుడు అదే కోవ‌లోకి మ‌రో క‌ట్ట‌డం కూడా చేరిపోతుంది. అదే దుర్గ‌మ్మ చెరువు ద‌గ్గ‌ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా క‌డుతున్న రోప్ బ్రిడ్జి. ఆసియాలోనే రెండో పెద్ద వంతెన‌గా రికార్డుల‌కు ఎక్క‌బోతుంది ఈ క‌ట్ట‌డం. దీనికి సంబంధించిన ప‌నులు చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్ర‌భుత్వం వంతెన ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మ‌హాన‌గ‌రంలో హైటెక్‌సిటీ, మెట్రోరైల్‌ నిర్మాణం చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ నే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేస్తోంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉండే జూబ్లీ హిల్స్ రోడ్డునెంబర్ 45 నుంచి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్ మాల్ వరకు ఈ రోప్ బ్రిడ్జ్ నిర్మించారు. దీంతో హైటెక్‌సిటీ, కొండాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గనుంది. దుర్గం చెరువు రెండువైపుల రూపురేఖలు ఈ ప్రాజెక్ట్‌తో మారిపోనున్నాయి. అరుదైన జాతి మొక్కలను పెంచి.. గ్రీన్‌ రివర్‌ ఫ్రంట్‌గా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా సింగిల్‌ పిల్లర్‌తో వేలాడే తీగల వంతెన హైదరాబాద్‌కు హైలెట్‌గా నిలవడం ఖాయం అని ఎల్ అండ్ టీ అధికారులు అంటున్నారు.

దుర్గం చెరువు వద్ద కట్టబోయే రోప్ బ్రిడ్జి నమూనాను పరిశీలిస్తున్న కేటీఆర్


ఈ బ్రిడ్జ్‌ డిజైన్‌ చాలా క్లిష్టతతో కూడుకున్నది. ఐఆర్‌సీ ప్రమాణాల ప్రకారం వంతెనను బలమైన ఉక్కు తీగలతో వేలాడేటట్టు నిర్మించారు. జర్మనీ, స్వీడన్‌, అమెరికా, యూకే తదితర దేశాల్లో వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ వంతెన నిర్మాణానికి ఉప‌యోగించారు. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి ఇనార్బిట్‌ మాల్‌ వైపుగా దుర్గం చెరువుపై ఈ బ్రిడ్జ్ క‌ట్టారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.184 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్ దుర్గంచెరువు పై 754.38 మీటర్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 13 ఫౌండేషన్లు వేశారు. నిర్మాణం తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్రారంభానికి అధికారులు స‌న్నాహాలు చేస్తోన్నారు.

దుర్గం చెరువు వద్ద నిర్మాణంలో ఉన్న రోప్ బ్రిడ్జి
ప్ర‌స్తుతం మ‌న దేశంలో కోల్‌కతాలోని రవీంద్రసేతు, ఇత‌ర ప్రాంతాల్లో ఒకటి రెండు మాత్రమే రోప్‌ బ్రిడ్జ్‌లు ఉన్నాయి. అవి కూడా చాలా చిన్న ప‌రిమాణాల్లో క‌ట్టినవే. ప్ర‌స్తుతం తెలంగాణలో వరంగల్ లక్నవరం చెరువులో ఉన్న దీవులను చేరుకోవడానికి చిన్న చిన్న రోప్ బ్రిడ్జ్ లు ఉన్నాయి. వాటి వల్ల అక్కడ పర్యాటకంగా ఎంతో అభివృద్ది జరిగింది. అలాంటిదే భారీ రోప్ బ్రిడ్జ్ ఇప్పుడు హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోనికి రానుంది. ఇప్పుడు క‌డుతున్న ఈ వంతెనపై వాకింగ్‌ ట్రాక్, సైక్లింగ్‌ ట్రాక్‌లనూ ఏర్పాటు చేశారు అధికారులు.

(ఎం.బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...