అమరావతిపై జగన్ వైఖరి ఇదే.. బొత్స వ్యాఖ్యలతో క్లారిటీ

Amaravati News | అమరావతి రైతులకు అన్యాయం జరగనివ్వం అని చెపుతూనే... అక్కడ నుంచి తరలించేది లేదని మాత్రం వైసీపీ ప్రభుత్వం తేల్చి చెప్పడం లేదు.

news18-telugu
Updated: September 7, 2019, 7:08 PM IST
అమరావతిపై జగన్ వైఖరి ఇదే.. బొత్స వ్యాఖ్యలతో క్లారిటీ
వైఎస్ జగన్
  • Share this:
ఏపీ అభివద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారా?. కేవలం చంద్రబాబు వ్యవహారం కారణంగానే రాజధాని విషయంలో ఇంకా అస్పష్టత కొనసాగుతోందా?.. ఈ మాటలు కొంత విడ్డూరంగా ఉన్నా వాస్తవం అంటున్నారు ఏపీ లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు నాయుడు కారణంగానే రాజధాని సమస్య వచ్చిందని చెపుతున్నారు. సమసి పోయిందనుకున్న అమరావతి సమస్యను మరోసారి తెరమీదకు తెచ్చారు బొత్స. ఇంతకూ ఆయన విమర్శల వెనుకున్న ఆంతర్యం ఏమిటి?

అధికార వికేంద్రీకరణ... ప్రస్తుతం సర్కారులో వినిపిస్తున్న మాట. అలా అని రాజధాని అమరావతి మారుతుందని మాత్రం చెప్పడం లేదు. పోనీ కొనసాగిస్తామని కూడా చెప్పడం లేదు ఏపీ సర్కారు. మరి ఎందుకింత రాద్దాంతం జరుగుతోంది. అమరావతికి వరద ముంపు ప్రమాదం ఉందని బొత్స కామెంట్ చేశారు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉండవచ్చు. ఎందుకంటే అధికారిక అంచనాల ప్రకారం 19 అడుగుల వరకు వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నిర్మాణాలు ఏవీ నదీ మట్టానికి 19 అడుగులకు పైన లేవు. ఇదంతా ఒక అంశం. అమరావతి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు మరో ఎత్తు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని ప్రకటించారు. కానీ అందుకు సంబంధించి గెజెట్ మాత్రం విడుదల చేయలేదు. తాత్కాలిక నిర్మాణాలు చాలా చేశారు. కానీ శాశ్వత నిర్మాణాలు మాత్రం మొదలు పెట్టలేదు. చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారా?.. ఇది సమాధానం చెప్పలేని ప్రశ్న. మరో అంశం కూడా ఇక్కడ ప్రస్తావించాలి.. నిర్మాణాల ఖర్చు భారీగా పెరుగుతుందని బొత్స చెప్పారు. దానికి టీడీపీ శ్రేణులు ఒక్కసారి కూడా ఖర్చు పెరగదు అని చెప్పలేదు. రాష్ట్రంలో రాజధాని అంశంపై ఇంత రచ్చ జరిగినా మరోసారి బొత్స చేసిన కామెంట్స్ చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. అలా అని ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండా ఈ కామెంట్స్ చేశారనుకోవడానికి లేదు. కాబట్టి, రాజధాని విషయంలో ప్రస్తుతం ఉన్న గందరగోళం కొనసాగించేందుకు ఏపీ సర్కారు ఉత్సాహం చూపుతోందనుకోవాలి.

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన చర్చనీయాంశమైన కామెంట్లు ఏమిటి?. ప్రధానంగా 2014లో నవ్యాంధ్ర సీఎం అయిన చంద్రబాబు... ప్రజలను ఇష్టమొచ్చినట్లు మోసం చేసి... ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటమి బాధను జీర్ణించుకోలేకే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్‌కి తుగ్లక్ పాలన అంటే ఏంటో తెలియట్లేదన్న బొత్స... ఆయన తండ్రి చంద్రబాబు చేసిందే తుగ్లక్ పాలన అని అన్నారు. రాజధాని అమరావతిపై చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న బొత్స సత్యనారాయణ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి, ఏపీలో సొంత ఇల్లు ఎందుకు నిర్మించుకోలేదని ప్రశ్నించారు. రాజధానిని తాత్కాలికంగా నిర్మించడం వల్లే... ఇప్పుడు పెట్టుబడులు రాకుండా పోయాయని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని తాము కొనసాగించలేక... రివర్స్ టెండరింగ్‌కి వెళ్లామన్న బొత్స... అందులో తప్పేముందని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్‌కి వెళ్తే... తన అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతో చంద్రబాబు భయపడుతున్నారని సెటైర్ వేశారు. రాజధాని విషయంలో రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని కొనసాగిస్తామన్న బొత్స... రాజధాని గ్రామాల రైతులకు అన్యాయం జరగదన్నారు.

ఫైనల్ గా ఏపీ సర్కారు నిర్ణయం అమరావతి విషయంలో అస్పష్టతను కొనసాగించడమే. రైతులకు అన్యాయం జరగనివ్వం అని చెపుతూనే... అక్కడ నుంచి తరలించేది లేదని మాత్రం తేల్చి చెప్పడం లేదు. ఇప్పటికే మంగళగిరి సమీప ప్రాంతాలకు కార్యాలయాలు తరలించే యోచనలో సర్కారు ఉందని వార్తలు వస్తున్నాయి. వాటిపైనా మంత్రి క్లారిటీ ఇస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading