BOLLYWOOD TOLLYWOOD ACTOR SONU SOOD MEETS DELHI CM ARVIND KEJRIWAL AS PUNJAB POLLS NEXT YEAR SK
Sonu Sood Meets Kejriwal: కేజ్రీవాల్‌తో సోనూ సూద్ భేటీ.. ఆమాద్మీ నుంచి రాజకీయాల్లోకి..?
కేజ్రీవాల్‌తో సోనూసూద్ భేటీ
Sonu Sood Meets Arvind Kejriwal: ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు జరగనుండడం.. అక్కడ ఆమాద్మీ పార్టీ బలోపేతంపై కేజ్రీవాల్ దృష్టిపెట్టడం.. అదే రాష్ట్రానికి చెందిన సోనూసూద్‌తో సమావేశమవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారు నటుడు సోనూ సూద్ (Sonu Sood). రోగులకు మందులు పంపిణీ చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు తరలించి ఎంతో మందికి ఊపిరి పోశారు. ఆకలితో అలమటించిన పేదలకు అన్నం పెట్టారు. విద్యార్థులకు పుస్తకాలు, స్మార్ట్ఫోన్లు అందించారు. అందుకే సోను సూద్‌ను యావత్ భారత్ రియల్ హీరోగా ప్రశంసించింది. అపద్బాంధవుడిగా కీర్తించింది. సొంత డబ్బులు, విరాళాలతోనే ఇన్ని పనులు చేస్తున్న సోనూసూద్.. రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేయగలరని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని లక్షలాది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు సోనూసూద్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని ఆ మధ్య ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తో భేటీ అయ్యారు సోనూసూద్. వీరిద్దరి భేటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఐతే వీరిద్దరి భేటీపై అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. సమావేశం అనంతరం.. ఇద్దరు కలిసి ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ్కే మెంటర్స్ ప్రొగ్రామ్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతోందని... దానికి సోనూసూద్‌ను బ్రాండ్‌గా నియమించినట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. లక్షలాది మంది విద్యార్థులకు మెంటర్‌గా వ్యవహరించే అవకాశం రావడం సంతోషంగా ఉందని సోనూ సూద్ అన్నారు.
Delhi CM Arvind Kejriwal and actor Sonu Sood address a joint press conference
Sonu Sood ji has agreed to become the brand ambassador of our 'Desh Ke Mentors' program which will be launched soon: Delhi CM pic.twitter.com/Aa5cxZWrMc
మరోవైపు సోనూద్ సూద్ రాజకీయ ప్రవేశంపైనా రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్‌పై ఆమాద్మీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ బలోపేతంపై అర్వింద్ కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా గురువారం పంజాబ్‌లో పర్యటించారు. ఆయన సమక్షంలో శిరోమణి అకాలీదళ్‌కు చెందిన పలువురు కీలక నేతలు ఆమాద్మీ పార్టీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్‌తో సోనూసూద్ సమావేశం కావడం చర్చనీయాంశమయింది.
సోనుసూద్ స్వరాష్ట్రం పంజాబ్. మోగా పట్టణంలో ఆయన పుట్టి పెరిగారు. ఈ క్రమంలోనే సోనూ సూద్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను వినియోగించుకోవాలని ఆమాద్మీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోనూసూద్ పార్టీలో చేరితే పంజాబ్‌లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయంలో ఆమాద్మీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారట. ఐతే మరికొందరు మాత్రం సోనూసూద్ రాజకీయాల్లోకి రాకపోవచ్చని, ఆయన సోదరి మాళవిక సచార్ ఆమాద్మీ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి ఆమాద్మీ పార్టీ తరపున పోటీ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు పంజాబ్ ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆయన సోదరి మాళవిక కూడా స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. పలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం ఆమె ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ సోదరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు పోటీ చేసే అవకాశముందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిని ముందే పసిగట్టిన ఆమాద్మీ పార్టీ.. ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా జాగ్రత్తపడుతోందని, అందుకే సోనూసూద్‌తో సమావేశమై పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అవేమీ లేవని..కేవలం 'దేశ్ కే మెంటర్స్ ప్రోగ్రామ్' గురించే చర్చలు జరిగినట్లు సోనూసూద్ సన్నిహితులు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.