పసుపు కుంకుమ ముసుగులో ఓటర్లకు డబ్బులు... పావులుగా డ్వాక్రా మహిళలు

ఇప్పటికే ఓ నియోజకవర్గంలో 12 వేల మంది డ్వాక్రా మహిళలకు డబ్బులు పంపిణీ చేసి ఓటర్లకు పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. 3 నియోజకవర్గాలలో కనీసం లక్ష మంది పొదుపు సంఘాల మహిళలను తమకు అనుకూలంగా మార్చుకుంటే డబ్బులు ఓటర్లకు పంచడం సులభతరం అవుతుందని టీడీపీ, వైసీపీ అభ్యర్థుల వ్యూహంగా కనిపిస్తోంది.

news18-telugu
Updated: April 8, 2019, 8:27 AM IST
పసుపు కుంకుమ ముసుగులో ఓటర్లకు డబ్బులు... పావులుగా డ్వాక్రా మహిళలు
ఇప్పటికే ఓ నియోజకవర్గంలో 12 వేల మంది డ్వాక్రా మహిళలకు డబ్బులు పంపిణీ చేసి ఓటర్లకు పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. 3 నియోజకవర్గాలలో కనీసం లక్ష మంది పొదుపు సంఘాల మహిళలను తమకు అనుకూలంగా మార్చుకుంటే డబ్బులు ఓటర్లకు పంచడం సులభతరం అవుతుందని టీడీపీ, వైసీపీ అభ్యర్థుల వ్యూహంగా కనిపిస్తోంది.
  • Share this:
మరో 24 నాలుగు గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిసిపోబోతోంది. ఓటర్ల మద్దతు కోసం కాల్లరిగేలా తిరిగిన ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల అభ్యర్థులు తమ అదృష్టాన్ని ఏప్రిల్ 11న పరీక్షించుకోబోతున్నారు. టీడీపీ అభివృద్ధి నినాదం, సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుని ఉంటే.. ప్రభుత్వం వ్యతిరేకత, నియోజకవర్గాలలోని స్థానిక సమస్యలు తమకు అనుకూలంగా మారతాయని వైసీపీ భావిస్తోంది. మరోవైపు.. తాయిలాలతో ఓటర్లను డబ్బుతో కొనుగోలుకు అన్ని పార్టీల అభ్యర్థులు వినూత్న పద్దతులను అవలంబిస్తున్నారు. ఎన్నికల అధికారులకే సవాల్ విసురుతూ అందరూ తమదైన దారిలో ఓటర్లకు డబ్బు, మద్యం విచ్చల విడిగా పంచుతున్నారు. తాయిలాలు పంచడానికి డ్వాక్రా మహిళలను పావులుగా చేసుకుని అధికారులకు సవాల్ విసురుతున్నారు.

ప్రకాశం జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపు, ఓటములు మహిళలపై ఆధారపడి ఉన్నాయి. దీంతో మహిళా ఓటర్లు కీలకం కావడంతో డ్వాక్రా సంఘాల ద్వారా డబ్బుల పంపిణీకి అభ్యర్థులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 1న వైసీపీ అభ్యర్థికి చెందిన బందువులు డ్వాక్రా సంఘాల్లో కీలకపాత్ర పోషించే నాయకరాల్లతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఇస్తున్న పసుపు-కుంకుమ కంటే అధికంగా ఒకేసారి అధికంగా డబ్బులు ఇస్తామని... తమ సొంత పథకం గురించి వివరించి సహకరించాలని వారిని కోరారు. దీంతో ఆలోచనలో పడిన కొందరు మహిళలు అందుకు అంగీకారం తెలపి డబ్బులు పంపిణీకి సై అని పచ్చజెండా ఊపారు. మరికొందరు మాత్రం ఎందుకు వచ్చిన గొడవ అని మళ్లీ వస్తామని చెప్పి అక్కడ నుంచి జారుకున్నారు. ఇలా విజయం కోసం విచ్చల విడిగా డబ్బుల పంపిణీకి అభ్యర్థులు ఎంతకైనా సిద్దమవుతుండటంతో... దానికి ఆశపడిన మహిళా సంఘాల నేతలు తెలియకుండానే ఊబిలో చిక్కుకు పోతున్నారు.

ఏప్రిల్ 3న టీడీపీ అభ్యర్థికి చెందిన వసతిగృహంపై ఎన్నికల అధికారులు దాడి చేయగా అక్కడ పొదుపు సంఘాల నాయకురాళ్లు కనిపించారు. పోలీసులను చూసి షాక్ కి గురైన వారు తాము ప్రచారానికి వచ్చామని.. చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. జిల్లాలో ప్రధానంగా ఒంగోలు, చీరాల, పర్చూరు నియోజకవర్గాలలో ప్రధానంగా ఈ విధంగా ఓటర్లకు డబ్బులు పంపిణీకి డ్వాక్రా మహిళకు అభ్యర్థులు ఎరవేస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాలలో సుమారు 2.68 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలు ఉన్నారు. కీలకమైన ఒంగోలు నియోజకవర్గంలోని ఒంగోలులోనే 60 వేల మంది ఉన్నారు. వారిలో కనీసం 30 వేలమందికి డబ్బులు ఆశ చూపించి.. మహిళలకు, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంపై అభ్యర్థులు దృష్టి సారించారు.

ఇప్పటికే ఓ నియోజకవర్గంలో 12 వేల మంది డ్వాక్రా మహిళలకు డబ్బులు పంపిణీ చేసి ఓటర్లకు పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది. 3 నియోజకవర్గాలలో కనీసం లక్ష మంది పొదుపు సంఘాల మహిళలను తమకు అనుకూలంగా మార్చుకుంటే డబ్బులు ఓటర్లకు పంచడం సులభతరం అవుతుందని టీడీపీ, వైసీపీ అభ్యర్థుల వ్యూహంగా కనిపిస్తోంది. దీనిని గమనించిన ప్రత్యర్థులు సైతం అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. కానీ, పొదుపు సంఘాల మహిళలకు ఓ టీంగా ఉండటం.. ఇప్పటికే పసుపు-కుంకుమ చెక్కులు వారికి అందడంతో అధికారులు వారివద్ద డబ్బులు ఉన్నా దానిని అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకవేల మహిళలను ప్రశ్నించినా ఇవి పసుపు- కుంకుమ డబ్బులు మా సంఘంలో పంపిణీకి తెచ్చాము అని వారు సమాధానం ఇస్తారని, దీనికి తాము ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని ఎన్నికల సంఘం అధికారులు తమ అశక్తత వ్యక్తం చేస్తున్నారు.పొదుపు సంఘాల్లో మహిళలు ఐక్యంగా ఉండటం. వారికి ఏ రుణం వచ్చినా, ఏ పథకం ద్వారా లబ్ది చేకూరినా.. సామూహికంగా బృందం మొత్తానికి ఇస్తారు. దీనిని సమంగా అందరూ పంచుకోవడం, సమన్వయం చేసుకోవడంలో నాయకురాల్లు ఆరితేరి ఉండటంతో ఇప్పుడు అభ్యర్థులు ఆ దారినే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడానికి ఎంచుకున్నారని ఈసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  మరోవైపు.. జిల్లా అధికారులు మాత్రం ఈ పంపిణీపై ఇప్పటికే తమకు అనేక ఫిర్యాదులు అందాయని.. తాత్కాలిక ప్రయోజనాలకోసం పొదుపు సంఘాల మహిళలు ఈ విష వలయంలో చిక్కుకోవద్దని సూచిస్తున్నారు. ఏదైనా కేసులు ఇరుక్కుంటే పరువు పోవడంతో పాటు... జైలుకు వెల్లవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి.. అభ్యర్థులు పన్నిన ఈ వ్యూహాన్ని అధికారులు అడ్డుకుంటారో లేక నిస్సహాయంగా మిగిలిపోతారో పోలింగ్ ముందు ఉన్న రెండు రోజుల్లో తేలిపోతుంది.

(డి. లక్ష్మీనారాయణ, న్యూస్18 తెలుగు, ప్రకాశం రిపోర్టర్)
First published: April 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>