చెప్పేదొకటి.. చేసేదొకటి.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డ జేపీ నడ్డా

కేసీఆర్ దగ్గరున్న గిన్నెలో పెద్ద కన్నం ఉందని, అందులో ఎన్ని నిధులు పోసినా.. కమిషన్‌లోకి వెళ్లిపోతుందని జేపీ నడ్డా ఆరోపించారు.

news18-telugu
Updated: August 18, 2019, 7:04 PM IST
చెప్పేదొకటి.. చేసేదొకటి.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డ జేపీ నడ్డా
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP Telangana/Twitter)
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రం ఇస్తామంటే... కేసీఆర్ తీసుకోవడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టును తీసుకోలేదని, ఇప్పుడు ఆరోగ్య శ్రీ కూడా ఏమైందని ప్రశ్నించారు. రూ.1400 కోట్ల బకాయిలు ఉండడంతో ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదన్నారు. కేసీఆర్ నిర్ణయం వల్ల తెలంగాణలో 26లక్షల మంది ఆయుష్మాన్ భారత్ లబ్ధిని కోల్పోయారని చెప్పారు. తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామంటే కూడా వద్దంటారని ఆరోపించారు. కేసీఆర్ మహారాజులా ఫీల్ అవుతున్నారని, ఆయన తాను తన కుటుంబం అనే భావన తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని జేపీ నడ్డా మండిపడ్డారు. కేసీఆర్ దగ్గరున్న గిన్నెలో పెద్ద కన్నం ఉందని, అందులో ఎన్ని నిధులు పోసినా.. కమిషన్‌లోకి వెళ్లిపోతుందని జేపీ నడ్డా ఆరోపించారు. ‘వాస్తు లేదన్న కారణంతో సెక్రటేరియట్ కూల్చేస్తున్నారట. వాస్తు కథ ఏంటో 2022లో తెలుస్తుంది. ఇది ప్రజాస్వామ్యమ? సచివాలయం కూల్చివేతపై కోర్టు కూడా అభ్యంతరం తెలిపింది. అయినా కూడా కేసీఆర్ మొండిగా ముందుకెళ్తున్నారు. అసలు కేసీఆర్ కేబినెట్‌లో మహిళలు ఏరి? దళితులకు ప్రాతినిథ్యం ఏది?’ అని జేపీ నడ్డా ప్రశ్నించారు.

కాళేశ్వరం ఎంత గొప్ప పేరు. అందులో చేసేదంతా తప్పుడు పని. రూ.30వేల కోట్ల ప్రాజెక్టును రూ.80వేల కోట్లకు పెంచారు. మిషన్ కాకతీయలో వీళ్లు చేసిన పనులకు ఏకంగా ట్యాంకులే క్లీన్ అయిపోయాయి. కేసీఆర్ దృష్టిలో మిషన్ అంటే కమీషన్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్నీ అంతే. భగీరథుడు గంగను నేలకు తెస్తే దాన్ని రైతులకు కూడా ఇవ్వలేకపోతున్నారు. హరితహారంలో మొక్కలు ఎక్కడ నాటారో తెలీదు. ఇక్కడ మాత్రం ఎండ, వేడి పెరిగిపోతుంది. కేసీఆర్ చెప్పేదొకటి. చేసేది ఇంకొకటి. తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అన్నారు. ఏమయ్యాయో తెలీదు. ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది.
జేపీ నడ్డా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్


తెలంగాణ లాంటి పుణ్యభూమి, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర భూమికి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదం బీజేపీకి ఎప్పుడూ ఉంటుందని తనకు విశ్వాసం ఉంటుందన్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వానికి మద్దతు పలుకుతూ బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన నేతలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మోదీ, అమిత్ షా ద్వయం దేశానికి కొత్త దిశను చూపిస్తుందని జేపీ నడ్డా అన్నారు. బీజేపీలో ఉన్న ప్రజాస్వామ్యం ఇతర పార్టీల్లో ఉండదన్నారు. మిగిలిన పార్టీల్లో తాను, తన తర్వాత కొడుకు లేదా కూతురు వంటి వారికే పగ్గాలు అప్పగిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియాగాంధీకే బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన ప్రస్తావించారు. బీజేపీ బలోపేతానికి సంబంధించి సెప్టెంబర్‌లో బూత్ ఎన్నికలు, అక్టోబర్‌లో మండల ఎన్నికలు, నవంబర్ లో జిల్లా బీజేపీ ఎన్నికలు, డిసెంబర్‌లో రాష్ట్ర స్థాయిలో పార్టీ అధ్యక్షుల ఎన్నికలు జరుగుతాయన్నారు. డిసెంబర్ 31 నాటికి జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో దేశం మొత్తం మద్దతు పలికిందన్నారు. ఆర్టికల్ 370 సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసని, అయితే, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఆ పని చేయలేదన్నారు. నరేంద్ర మోదీ ఇచ్చిన మాట ప్రకారం రెండోసారి అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే పని పూర్తి చేశారని జేపీ నడ్డా అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని జేపీ నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు.
First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>