BJP WOMEN MPS APPROACH EC OVER RAHUL GANDHIS REMARK SK
రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
ఐతే తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. బీజేపీ ఈ రాద్ధాంతం చేస్తోందని ఎదురుదాడికి దిగారు.
అత్యాచార ఘటనలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయాల కోసం దేశం పరువు తీస్తున్నారంటూ బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి స్మృతి నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలు శుక్రవారం రాత్రి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. ఒక ఎంపీ స్థానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని..ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
''అత్యాచార ఘటనలను రాహుల్ గాంధీ రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటున్నారు. దేశంలో తొలిసారిగా ఓ రాజకీయ నేత అత్యాచారాలను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు. మహిళలపై అత్యాచారాలు జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. పురుషులంతా రేపిస్టులని ఆయన అంటున్నారు. మేం మేకిన్ ఇండియా అంటుంటే.. రాహుల్ గాంధీ రేపిన్ ఇండియా అంటున్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి శిక్ష వేయాలనేది ప్రజలకే వదిలేస్తున్నా.'' అని స్మృతి ఇరానీ అన్నారు.
కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అత్యాచార ఘటనలపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐతే తానేమీ తప్పు మాట్లాడలేదని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. బీజేపీ ఈ రాద్ధాంతం చేస్తోందని ఎదురుదాడికి దిగారు.