news18-telugu
Updated: December 2, 2020, 7:40 PM IST
పువ్వాడ అజయ్ కుమార్ (File)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూకట్పల్లి ఫోరం షాపింగ్ మాల్ వద్ద మంత్రి కారు మీద దాడి జరిగింది. మంత్రి పువ్వాడ అజయ్ తన కారులో డబ్బులు పెట్టుకుని వచ్చారనే అనుమానంతో బీజేపీ నేతలు దానిపై దాడికి దిగారు. కారు బ్యానెట్ మీద ఓ యువకుడు ఎగిరి కూర్చున్నాడు. మరో యువకుడు కారు వెంట పడ్డాడు. ఈ విషయం పెద్ద దుమారం రేపింది. బీజేపీ నేతలు తన మీద పథకం ప్రకారం హత్యకు కుట్ర పన్నారని అజయ్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఆయన బీజేపీ మీద కూడా రాయడానికి వీల్లేని భాషలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అసత్య ప్రచారం చేసి విజయం సాధించిందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఈ అంశం పెద్ద దుమారానికి దారితీసింది. దీనిపై సీపీఐ నేత నారాయణ ఘాటుగా స్పందించారు. మంత్రి అజయ్ తీరును తప్పుపట్టారు. కారులో ఓ వ్యక్తి బానెట్ మీద పడుకుని ఉండగా, మరో వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో కారును వేగంగా తీసుకుని వెళ్లడాన్ని నారాయణ తప్పుపట్టారు. ఒకవేళ ఎవరైనా చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటని నిలదీశారు. కారులో డబ్బులు లేకపోతే ఎందుకు ఆపకుండా వెళ్లిపోయారని నారాయణ సందేహం వ్యక్తం చేశారు. మంత్రి అజయ్‌ను కేబినెట్ నుంచి తప్పించాలని నారాయణ డిమాండ్ చేశారు.
నారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అజయ్ ఘాటుగా స్పందించారు. నారాయణ ఎప్పుడు బీజేపీలో చేరారని వ్యంగ్యంగా మాట్లాడారు. తానేనీ ముగ్దూం భవన్లో (సీపీఐ ఆఫీసు) సెక్యూరిటీ గార్డును కాదని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రినని చెప్పారు. మంత్రి అజయ్ తీరును మరోసారి నారాయణ ఖండించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరింది అజయ్ అని, తాను పుట్టినప్పటి నుంచి ఒకే పార్టీలో ఉన్నానన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 2, 2020, 7:26 PM IST