BJP TO WELCOME EETALA RAJENDER IN HYDERABAD AFTER HUGE VICTORY IN HUZURABAD BYPOLL SK
Eetala Rajender: హైదరాబాద్‌లో నేడు ఈటల రాజేందర్ ర్యాలీ... భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ
ఈటల రాజేందర్
Eetala Rajender: ఉపఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాబోతున్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈటల రాజేందర్ (Eetela Rajender) పేరు మార్మోగిపోతోంది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో (Huzurabad Bypoll) అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి అద్భుత విజయాన్ని సాధించారు. ఈటల గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఐతే ఉపఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి (BJP Head Office) రాబోతున్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో... తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట ఇవాళ ర్యాలీ చేపట్టనున్నారు ఈటల. మధ్యాహ్నం 1 గంటకు శామీర్‌పేట్‌లోని తన నివాసం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. శామీర్ పేట్, తుమ్మికుంట, అల్వాల్, ప్యారడైజ్, రాణిగంజ్, గన్‌పార్క్ మీదుగా బీజేపీ కార్యాలయానికి ఆయన చేరుకుంటారు.
మొదట ఆయన గన్‌పార్క్‌కు చేరుకొని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి వస్తున్న ఈటలకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. పౌర సన్మాన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించనుంది. అనంతరం హుజురాబాద్ ఎన్నికల్లో విజయంపై మీడియాతో మాట్లాడనున్నారు. ఐతే ఈసారి ఈటల రాజేందర్ ఏం మాట్లాడతారా? సీఎం కేసీఆర్ టార్గెట్‌గా మరోసారి విరుచుకుపడతారా? అని తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక త్వరలోనే ఆయన ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. అపాయింట్మెంట్ ఖరారు కాగానే ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ నేతల్ని కూడా కలవనున్నట్లు సమాచారం.
కాగా, నవంబరు 2న వెలువడిన హుజురాబాద్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఆయన 23,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈటల రాజేందర్ మొత్తం 1,07,022 ఓట్లు పోలవగా.. గెల్లు శ్రీనివాస్‌కు 83,167 మంది ఓటు వేశారు. వీరిద్దరు తప్ప ఇంకెవరికీ డిపాజిట్ దక్కలేదు. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3,014 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక ఓట్ షేరింగ్ విషయానికొస్తే.. బీజేపీకి 51,96శాతం ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 40.4 శాతం మంది ఓటు వేశారు. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల అంతరం 11శాతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 1.5శాతం ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలతో తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు నాంది పడిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్లో కేసీఆర్ వ్యతిరేక గళం వినిపించే అవకాశముందని, అసంతృప్తులు పార్టీనీ వీడే అవకాశముందని జోస్యం చెబుతున్నారు. ఐతే టీఆర్ఎస్ నేతలు మాత్రం.. బీజేపీకి అంతలేదని కౌంటర్ ఇస్తున్నారు. హుజురాబాద్ గెలుపు.. బీజేపీ బలుపు కాదని వాపు అని సెటైర్లు వేస్తున్నారు. ఒక్క ఓటమితో టీఆర్ఎస్ పార్టీ కుంగిపోదని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.