ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాలే టార్గెట్ గా భారతీయ జనతాపార్టీ విమర్శలు గుప్పించింది. తిరుపతిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే లక్ష్యంగా రాజకీయ తీర్మానాలు చేసింది. టీడీపీ వైసీపీల బాధ్యతారాహిత్యం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడింది. ఆ రెండు పార్టీలకు అభివృద్ధి కంటే అస్మదీయులకు దోచిపెట్టడమే లక్ష్యమని ఆరోపించింది. గత ప్రభుత్వాలు 60ఏళ్లలో లక్షకోట్లు అప్పు చేస్తే వైసీపీ ప్రభుత్వం 15నెలల్లో ఆ ఘనత సాధించిందని విమర్శించింది. సంక్షేమ పథకాలు, వాలంటీర్లు, రోడ్లు, వ్యవసాయం, కేంద్ర నిధులు తదితర అంశాలపై వైసీపీ ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం విమరమించుకోవాలని డిమాండ్ చేసింది.
సంక్షేమం పేరుతో సంక్షోభం
రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఇష్టానుసారం డబ్బులు పంచుతూ ఆర్ధికంగా రాష్ట్రం మునిగిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇసుక కుంభకోణాన్ని టీడీపీ.. వైసీపీ ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చిందని.., రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో టీడీపీ విఫలమైంతే.. వైసీపీ హయాంలో ఉన్న పరిశ్రమలు తరలిపోయి యువతకు ఉపాధి కరువైందని ఆరోపించింది. వ్యవసాయానికి సంబంధించిన ఏ సమస్యనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది.
అప్పుడలా..? ఇప్పుడిలా..?
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు అరాచకాలు సృష్టిస్తే.. వైసీపీ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఆపని చేస్తున్నారని విమర్శించిన బీజేపీ.. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించడం దారుణమని అభిప్రాయపడింది. జగనన్న వాత-పన్నుల మోత పేరుతో తో పన్నులు ఇష్టానుసారం పెంచి ప్రజల రక్తం పీలుస్తున్నాని ఆరోపించింది. పన్నుల రూపంలో కోట్ల రూపాయలు ప్రజల నంచి వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని తిరిగి వారికే వినియోగించడంలో పూర్తి అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కపట ప్రేమ చూపిస్తున్నాయని మండిపడింది.
వైసీపీ హయాంలో హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని.. ప్రముఖ ఆలయాల్లో అన్యమత ప్రచారాలు, రాజకీయ నిరుద్యోగులను ఆలయాల ఛైర్మన్లుగా నియమిస్తున్నారని తీర్మానంలో పేర్కొందది. అంతర్వేదిలో రథం దగ్ధం, దుర్గగుడిలో వెండి విగ్రహాల చోరీ, అలయాల్లో విగ్రహాల విధ్వంసంపై చర్యలు తీసుకోవడం లేదంది. ఇక కేంద్రం నిధులతో పోలవరం నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందన్నారు. అలాగే కేంద్రం నిధులతో నడుస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వేస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు, జగన్ ఇద్దరు స్టిక్కర్ ముఖ్యమంత్రులేనన్నారు.
తిరుపతి ఉపఎన్నికల్లో గెలుపుతో పాటు 2024 అసెంబ్లీ ఎన్నికలే పావులు కదుపుతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైసీపీతో పాటు టీడీపీని ప్రజల్లో దోషిగా నిలిపేందుకు యత్నిస్తోంది. మరి ఆపార్టీ లెక్కలు వర్కవుట్ అవుతాయో లేదా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది.