దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ ఉత్సాహాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికలను కమలదళం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి, వ్యూహాలు రచించేందుకు పార్టీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్ హైదరాబాద్ వచ్చారు. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం వెనుక ఆయన ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన భూపేంద్ర యాదవ్ ఎన్నికల వ్యూహాల్లో మంచి పేరున్న వ్యక్తి అని, అందుకే జీహెచ్ఎంసీ కోసం ఆయన్ను రంగంలోకి దిగారని పార్టీ నేతలు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును భాజపా ముమ్మరం చేసింది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల పరిశీలకులు భూపేంద్ర యాదవ్ భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ రోజు సాయంత్రానికి మెజార్టీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెండు విడతల్లో విడుదల చేయనున్నారు. భూపేంద్రయాదవ్ ఆమోదముద్ర పడగానే తొలి జాబితాను విడుదల చేయనుంది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ ఇన్ చార్జిలను నియమించింది. ఆయా నియోజకవర్గాల్లోని డివిజన్లలో బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఆ నేతలు పర్యవేక్షించనున్నారు.
1.ఎల్బీనగర్ - సంకినేని వెంకటేశ్వర రావు
2.మహేశ్వరం - యెన్నం శ్రీనివాస్ రెడ్డి
3.రాజేంద్రనగర్ - వన్నల శ్రీరాములు
4.శేరిలింగంపల్లి -ధర్మపురి అరవింద్
5.ఉప్పల్-ధర్మారావు6.మాల్కజిగిరి -రఘునందన్ రావు
7.కుత్బుల్లాపూర్ - చాడ సురేష్ రెడ్డి
8.కూకట్ పల్లి - పెద్దిరెడ్డి
9. పటాన్ చేరు - పొంగులేటి సుధాకర్ రెడ్డి
10. అంబర్పేట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి
11.ముషీరాబాద్ - జితేందర్ రెడ్డి
12.సికింద్రాబాద్ - విజయరామ రావు
13.కంటోన్మెంట్ - శశిధర్ రెడ్డి
14.సనత్ నగర్ - మోత్కుపల్లి నర్సింహులు
15.జూబ్లీహిల్స్- ఎర్ర చంద్ర శేఖర్
16.ఖైరతాబాద్ - మృత్యుంజయ
17.నాంపల్లి - సాయం బాపురావు
18.చార్మినార్ -కాసిపేట లింగయ్య
19.గోశామహల్ - యెండల లక్ష్మీనారాయణ
20.కార్వాన్ - బొడిగే శోభ
21.మలక్ పేట - విజయపాల్ రెడ్డి
22.యకత్ పుర - రామకృష్ణ రెడ్డి
23.చాంద్రాయణగుట్ట - రవీంద్ర నాయక్
24.బహదూర్ పుర - సుద్దాల దేవయ్య
ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండబోదని టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. జనసేన సహా ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు తమను ఎవరూ పొత్తుల గురించి సంప్రదించలేదని బండి సంజయ్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం తమ ప్రధాన ప్రత్యర్థి అని బండి సంజయ్ స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 99 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. ఎంఐఎం 44 సీట్లలో గెలిచింది. టీడీపీ కేవలం ఒక్కచోట గెలుపొందింది. బీజేపీ 4 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో విజయం సాధించింది.