Home /News /politics /

BJP PRESIDENT AMIT SHAH IS THE MOST TRUST WORTHY FOR PRIME MINISTER NARENDRA MODI BS

అమిత్ షా అంటే మోదీకి ఎందుకంత నమ్మకం.. దాని వెనక కారణం ఇదీ..

అమిత్ షా, మోదీ

అమిత్ షా, మోదీ

Lok Sabha Elections 2019: కాషాయ పార్టీ అధికారంలోకి రావడానికి అమిత్ షా చేసిన కృషి, రచించిన వ్యూహాలు, అమలు చేసిన ప్రణాళికలు అంత పకడ్బందీగా, పక్కాగా ఉంటాయి మరి.

  నరేంద్ర మోదీ.. ఈ పేరు కొందరికి ధైర్యం, మరికొందరికి నమ్మకం, ఇంకొందరికి ఇష్టం. ఆయన మాట వాళ్లకు బ్రహ్మ వాక్కు. ఏదైనా చెబితే చేస్తాడన్న ఆశ. అందుకే ఆయన పేరుతోనే రెండో సారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదంటారు విశ్లేషకులు. ఒక సభలో నోరు విప్పి మాట్లాడారంటే ఆయన స్పీచ్‌లకు ఫిదా అయిపోవాల్సిందే. కానీ, మిత భాషి. వేరే వాళ్లతో అవసరమైతే తప్ప ఎక్కువగా మాట్లాడని మోదీలో నాయకత్వ లక్షణాలు బోలెడు. కనుసైగలతోనే దేశాన్ని శాసిస్తున్నాడని, ప్రజల్ని పాలిస్తున్నాడని అంటుంటారు ఆయన్ను దగ్గర నుంచి చూసినవాళ్లు. ఎవర్నీ అంత త్వరగా నమ్మరు. దగ్గరికి రానివ్వరు. వారితో మాట్లాడరు. మరి ఇంత రిజర్వుడుగా ఉండే మోదీ అమిత్‌ షాను మాత్రమే ఎలా నమ్మారు? ఆయనతో అంత ఫ్రీగా ఎలా మాట్లాడతారు? అని ఎంతో మందిలో సందేహాలు తలెత్తుతాయి. షా మీద నమ్మకంతో గొప్ప గొప్ప బాధ్యతలు అప్పగిస్తారు.. అసలు ఇది ఎలా సాధ్యమవుతోంది? మోదీ ఎక్కువ నమ్మేంతగా షా ఏం చేశారు? అమిత్ షా అంటే మోదీ ఆత్మ అనేంతలా ఎలా మారారు? అంటే.. అనిల్ రాయ్ రాసిన ‘షాడో పాలిటిక్స్’ పుస్తకంలోకి తొంగి చూడాల్సిందే...

  2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావడం, మోదీ ప్రధాని కావడంతో అమిత్ షాపై ఎనలేని నమ్మకం ఏర్పడింది నరేంద్రుడికి. ఎందుకంటే.. కాషాయ పార్టీ అధికారంలోకి రావడానికి అమిత్ షా చేసిన కృషి, రచించిన వ్యూహాలు, అమలు చేసిన ప్రణాళికలు అంత పకడ్బందీగా, పక్కాగా ఉంటాయి మరి. ఎన్నికల టూర్‌లో భాగంగా 2013 జూన్‌లో అమిత్ షా వారణాసి వెళ్లారు. అప్పటికి మోదీ తర్వాత పార్టీలో ఎక్కువ ప్రభావం చూపగల నేత. వారణాసి వెళ్లడానికి కారణం ఏంటంటే.. ఉత్తరప్రదేశ్‌లో మోదీ పోటీ చేసి గెలిచేందుకు వీలయ్యే లోక్‌సభ నియోజకవర్గాన్ని గుర్తించాలని ఆరెస్సెస్ ఆదేశించింది. అందుకు తగ్గట్లే తన మెదడుకు పని పెట్టి యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో కలియదిరిగారు. వారణాసి అయితే మోదీకి కలిసి వస్తుందని గ్రహించారు.

  నరేంద్ర మోదీ, అమిత్ షా


  కానీ ఆ సీటును వదులుకోవడానికి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి సిద్ధంగా లేరు. ప్రధానిగా తన జీవితాన్ని వారణాసి నుంచి ప్రారంభిస్తారని, కాబట్టి కాన్పూర్ నుంచి పోటీ చేయాలని జోషికి సూచించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో జోషి తన సీటును మోదీకి ఇచ్చేశారు. అక్కడ ‘వికాస్ పురుష్’ అంటూ మోదీ ఇమేజ్‌ను అమాంతం పెంచేలా ప్రచారం నిర్వహించి ఘన విజయం సాధించేలా కృషి చేశారు అమిత్ షా.

  అమిత్ షా, నరేంద్ర మోదీ..(File)


  అసలు అమిత్ షా, మోదీ మధ్య సంబంధం ఏనాటిది?
  అది 1982.. ఆరెస్సెస్ బ్రాంచీలో మోదీ ప్రచారక్‌గా పనిచేస్తున్నారు. అప్పటికి 17 ఏళ్ల వయసున్న అమిత్ షా మోదీని కలిశాడు. అప్పుడే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కొన్ని రోజులయ్యాక మోదీని బీజేపీలో చేరాలని డాక్టర్ బాలా సాహెబ్ దేవద కోరారు. అప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాలా, వద్దా అన్న డైలామాలోనే ఉండి అమిత్ షాను సలహా అడిగితే.. మంచిదేనని చెప్పారు. దాంతో రాజకీయాల్లో మోదీ అడుగు పడింది.

  షాపై మోదీకి నమ్మకం ఎలా కుదిరింది?
  2005లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు విషయంలో మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా ఉన్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. కేంద్ర హోం మంత్రిగా చిదంబరం పదవీ బాధ్యతలు చేపట్టాక సీబీఐ విచారణకు ఆదేశించారు. చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. 2010 జూన్ 25న అమిత్ షాను విచారణకు పిలిచి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. దాంతో ఆయన పదవి ఊడింది. షా మూడు నెలలు జైల్లోనే గడిపారు. అదే సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోదీని ఇబ్బందులకు గురిచేసిందని వార్తలు వచ్చాయి. మోదీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఒత్తిళ్లు కూడా వచ్చినట్లు తెలిసింది. అయితే, తన గురించి దిగులు చెందవద్దని, కాంగ్రెస్‌కు తలొగ్గవద్దని మోదీకి షా జైలు నుంచే సందేశం పంపినట్లు సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సోహ్రబుద్దీన్ కేసు వీరిద్దరి బంధానికి యాసిడ్ టెస్ట్ లాంటిది. దాంతో మోదీ-షా బంధం బలోపేతమైంది. షా జైల్లో ఉన్న సమయంలో ఆయనకు వివేకానందుడి పుస్తకాలు అందజేసి చదవాలని మోదీ సూచించారు.

  సోహ్రబుద్దీన్ కేసు విచారణలో భాగంగానే షాను గుజరాత్ నుంచి వెళ్లిపోవాలని, రెండేళ్ల పాటు ఇక్కడ అడుగు పెట్టవద్దని కోర్టు ఆదేశించడంతో ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ సమయంలోనే మోదీ.. ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను షాకు అప్పగించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 71 సీట్లు వచ్చేలా షా కృషి చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు.

  అమిత్ షాకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎలా దక్కింది?
  2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించాక, తనకు అత్యంత నమ్మకస్తుడైన అమిత్ షాను మోదీ జాతీయ అధ్యక్షుడిగా చేశారు. పెద్ద పోస్టు అప్పగించినందుకు చాలా మంది కనుబొమ్మలు ఎగరేశారు. ఆయనకు ఈ పోస్టా! అంటూ వేలెత్తి చూపారు. కానీ, మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న 12 ఏళ్ల కాలంలో అమిత్ షా ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 2014 తర్వాతే, ఇద్దరి మధ్య బంధం గురించి ప్రజలకు తెలిసిపోయింది. మోదీని ఒక బ్రాండ్ నేమ్‌గా మార్చడంలో షాదే ప్రధాన పాత్ర. మోదీ గీత దాటని వ్యక్తిగా షా నిలిచిపోయారు. ఇక, అప్పటి నుంచి మోదీ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని నెరవేర్చడం అమిత్ షా బాధ్యతగా మారిపోయింది.

  మోదీని బుజ్జగించడం షా వల్లే సాధ్యం..

  మోదీ కోపాన్ని చల్లార్చడం అమిత్ షా ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని కొందరు సన్నిహితులు అంటుంటారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు ఓ సందర్భంలో ఆరెస్సెస్ ఆదేశాల ప్రకారం మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాల్సి వచ్చింది. అయితే, మత మార్పిడికి సంబంధించిన ఏ బిల్లును కౌన్సిల్ ఆమోదించదని మోదీ అనుకున్నారు. అయితే, ఆ బిల్లును తీసుకొచ్చేలా మోదీని ఒప్పించి, మెప్పుపొందిన వ్యక్తి అమిత్ షా.

  మోదీ, షాలు సెంచరీలు సాధించే జంట బ్యాట్స్‌మెన్ లాంటివాళ్లు అని చాలామంది అనుకుంటారు. "నాణానికి మోదీ, షాలు రెండు ముఖాలు. దశాబ్దాలుగా వారి బంధం ఇలానే ఉంది. వారిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు. వారిద్దరిదీ అద్భుతమైన జోడీ. జీవితం, రాజకీయాలపై వారి భావాలు భిన్నంగా ఉండొచ్చు కానీ వాళ్లిద్దరూ కలిసే అన్నీ సాధిస్తారు. ఓ బ్యాట్స్‌మన్‌గా అమిత్ షా.. తన సహచర బ్యాట్స్‌మన్‌కు భారీ షాట్లు, సెంచరీలు కొట్టేందుకు అవకాశం కల్పిస్తారు. వ్యక్తిగతంగా తాను ఎక్కువ స్కోర్లు చెయ్యాలని అనుకోరు. తన పార్ట్‌నర్ విజయం సాధిస్తే, తద్వారా టీమ్ మొత్తం గెలిచేందుకు బాటలు పరుస్తారు" అని మోదీ, షాలను బాగా దగ్గరనుంచి పరిశీలించిన బీజేపీ నాయకుడు ఒకరు అన్నారు. 2014 విజయంలో అమిత్ షా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మోదీ వ్యాఖ్యానించారు. అంతేకాదు, "అమిత్ షా సినిమా డైరెక్టర్ లాంటివారు. తెర వెనకే ఉంటూ నటులను స్టార్లుగా మారుస్తారు. అలా ఎందరినో రాజకీయాల్లో స్టార్లుగా మార్చారు అమిత్ షా" అని మోదీ అన్నారు. కానీ అమిత్ షా దృష్టిలో మాత్రం మోదీనే సూపర్ స్టార్.

  అమిత్ షా చాలా క్రమశిక్షణతో, ప్రణాళికబద్ధంగా ఉంటారని రాజకీయ పరిశీలకులు చెబుతారు. ఆయన నిర్వహణనైపుణ్యాలు బీజేపీ కేడర్‌లో మిలిటరీ క్రమశిక్షణ మాదిరిగా కనిపిస్తాయని అంటారు. అందుకే అమిత్ షా మోదీ నమ్మకాన్ని సాధించగలిగారు.

  - అనిల్ రాయ్
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Amit Shah, Bjp, Central Government, Delhi, Gujarat, Lok Sabha Elections 2019, Narendra modi, Uttar pradesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు