టార్గెట్ తెలంగాణ... బీజేపీ ముఖ్యనేత ఫోకస్... ప్లాన్ రెడీ

తెలంగాణలో ఏ రకంగా బలపడాలనే అంశాలపై చర్చించడంతో పాటు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను బీజేపీ ముఖ్యనేత రామ్‌మాధవ్‌కు ఆ పార్టీ నాయకత్వం అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 31, 2019, 8:38 PM IST
టార్గెట్ తెలంగాణ... బీజేపీ ముఖ్యనేత ఫోకస్... ప్లాన్ రెడీ
అమిత్ షాతో మోదీ
  • Share this:
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించాలనే తమ టార్గెట్‌ను పూర్తి చేసుకునే క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్ట పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి నిరాశ కలిగించినప్పటికీ... ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు మాత్రం కమలనాథుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. టీఆర్ఎస్ బలంగా ఉండే ఉత్తర తెలంగాణలో ఏకంగా మూడు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడం బీజేపీకి ఆనందం కలిగిస్తోంది. తాము పెద్దగా దృష్టి పెట్టకపోయినా తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు దక్కించుకున్నామంటే... రాష్ట్రంపై ఫోకస్ పెడితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ సీనియర్ నేతలు బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది.

అందుకే తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే భావనలో ఆ పార్టీ నాయకత్వం ఉందని సమాచారం. తెలంగాణలో ఏ రకంగా బలపడాలనే అంశాలపై చర్చించడంతో పాటు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను బీజేపీ ముఖ్యనేత రామ్‌మాధవ్‌కు ఆ పార్టీ నాయకత్వం అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన రామ్‌మాధవ్... ముందుగానే రాష్ట్రంలోని అనేకమంది నాయకులను బీజేపీలో చేర్పించుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, సురేశ్ రెడ్డి ఢిల్లీలో ఆయన కలిసినట్టు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణలో టీఆర్ఎస్‌లోకి వెళ్లలేక, కాంగ్రెస్‌లో చేరలేక రాజకీయ భవిష్యత్తుపై బెంగతో ఉన్న టీ టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. టీ టీడీపీ నేతలను ఆకర్షిస్తే... వారితో పాటు వారికి ఉండే క్యాడర్ కూడా బీజేపీకి కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ముందుగా టీడీపీ నేతలను ఆ తరువాత తమతో కలిసొచ్చే కాంగ్రెస్ నేతలను కలుపుకునే టీఆర్ఎస్‌ను ఎదుర్కొవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలోనూ పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ... ఆ దిశగా ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందో చూడాలి.
Published by: Kishore Akkaladevi
First published: May 31, 2019, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading