పవన్‌కు బీజేపీ ఓపెన్ ఆఫర్.. జనసేన విలీనానికి ఆహ్వానం

బీజేపీతో ఉన్న సఖ్యతను ముందుగా పవన్ కళ్యాణే ప్రస్తావించారని జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. పెద్ద స్థాయిలో పార్టీలో స్థాపించిన చిరంజీవే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపారని.. పవన్ కల్యాణ్ దాగుడు మూతలు లేకుండా విలీనంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

news18-telugu
Updated: December 4, 2019, 8:51 PM IST
పవన్‌కు బీజేపీ ఓపెన్ ఆఫర్.. జనసేన విలీనానికి ఆహ్వానం
పవన్ కళ్యాణ్
  • Share this:
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీఎం జగన్, వైసీపీపై కొంత కాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. బీజేపీని మాత్రం పొగుడుతున్నారు. దేశానికి అమిత్ షా వంటి నేతలే కావాలంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. అంతేకాదు మరో అడుగు ముందకేసి బీజేపీకి తానెప్పుడూ దూరంగా లేనని తెలిపారు. హోదా విషయంలో సిద్ధాంతపరంగా మాత్రమే విబేధించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేన-బీజేపీ దోస్తీపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జనసేనను బీజేపీలో విలీనం చేస్తారా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనను విలీనం చేయాలనుకుంటే తాము స్వాగతిస్తామని ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యాక్రమంలో తెలిపారు. బీజేపీతో ఉన్న సఖ్యతను ముందుగా పవన్ కళ్యాణే ప్రస్తావించారని జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. పెద్ద స్థాయిలో పార్టీలో స్థాపించిన చిరంజీవే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపారని.. పవన్ కల్యాణ్ దాగుడు మూతలు లేకుండా విలీనంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అప్పుడు విభేదించిన వారు ఇప్పుడు కలిసి వస్తామంటున్నారు.మరి తప్పును తెలుసుకొని వస్తున్నారని అనుకోవాలా? లేక బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ పార్టీలో కలిసి లబ్ది పొందాలని వస్తున్నారో అర్థం కావడం లేదు. జనసేనను విలీనం చేయాలనుకుంటే మేం పూర్తిగా స్వాగతిస్తాం.  జనసేనను బీజేపీలో విలీనం చేయండి. అది మీకు మంచిది. మాకు మంచిది. బీజేపీకి బలం చేకూరుతుంది. అప్పుడు జగన్‌పై కలిసి పోటీ చేద్దాం. పొత్తులు పెట్టుకునే సమయం కాదు మిత్రమా. బీజేపీలో విలీనమవ్వండి.
జీవీఎల్ నరసింహారావు
ఇలా జనసేన విలీనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు, విలీనం ప్రసక్తే లేదని జనసేన పార్టీ నేత దుర్గేశ్ స్పష్టం చేశారు. పొత్తు పెట్టుకోవాలనో.. లేదంటే విలీనం చేయాలనో ఉద్దేశంతోనో పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>