ఏపీలో బీజేపీ కొత్త వ్యూహం.. షాక్‌లో సీఎం జగన్ అండ్ కో

ఇప్ప‌టికిప్పుడు టీడీపీ, బిజేపీ మ‌ళ్లీ క‌లుస్తున్నాయని చెప్ప‌లేక‌పోయినప్పటికి ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో బిజేపీ చాప‌కింద నీరులా త‌మ వ్యూహాన్ని అమ‌లు చేసే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 29, 2020, 6:42 PM IST
ఏపీలో బీజేపీ కొత్త వ్యూహం.. షాక్‌లో సీఎం జగన్ అండ్ కో
సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ
  • Share this:
(బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)
ఏపీలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. జ‌గ‌న్ మోహన్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చి ఏడాదికే ఇలాంటి ప‌రిణామాలు చోటుచేసుకోవడం రాజకీయవర్గాలకు ఒకింత ఆశ్చ‌ర్య‌న్ని క‌లిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో పాగా వేయ‌డానికి బిజేపీ మ‌ళ్లీ పావులు క‌దుపుతుంది. ఇందులో భాగంగా క‌మ‌దళం అడుగులు మ‌ళ్లీ తెలుగు త‌మ్ముళ్ల వైపు పడుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబుకు ద‌గ్గ‌రయ్యేందుకు బిజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా అంటే అవున‌నే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇప్పుడు జ‌గ‌న్ మోహన్ రెడ్డికి కొత్త త‌ల‌నొప్పులు తీసుకొస్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ‌కృష్ణ రాజు ఎపిసోడ్‌లో బిజేపీదే కీల‌క పాత్ర అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేప‌థ్యంలో.. తాజాగా పోల‌వ‌రం అంశంలో చంద్ర‌బాబ కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం రాజ‌కీయంగా కొత్త చ‌ర్చ‌కు తెరదీసింది బీజేపీ.

పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా ఆ ప్రాజెక్ట్‌ను త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌వారికి క‌ట్ట‌బెట్టారు సీఎం జ‌గ‌న్. అయితే తాజాగా కేంద్ర జ‌ల‌శ‌క్తిమంత్రిత్వ శాఖ పోల‌వ‌రంలో ఎటువంటి ఉల్ల‌ఘ‌న‌లు జ‌ర‌గ‌లేద‌ని, ఎటువంటి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ ప‌రిణామం రాష్ట్రంలో ఒక కొత్త రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీసింది. బీజేపీ చంద్రబాబుకు దగ్గ‌ర‌వ‌డంలో భాగంగానే ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసింద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు కేంద్రం ప్ర‌క‌ట‌న‌తో వైసీపీ శ్రేణులు కూడా డీలా ప‌డిపోయారు. ఇప్ప‌టి వర‌కు ఇదే అంశాన్ని ప‌దేప‌దే చెప్పే ఆ పార్టీ ఇప్పుడు డిఫెన్స్‌లో పడిపోయింది. అయితే బిజేపీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక చాలా పెద్ద కథే ఉందంటున్నాయి ఢిల్లీ వ‌ర్గాలు. 2014 ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా బీజేపీ జ‌గ‌న్‌పై వ్య‌తిరేక ప్ర‌చారం చేసింది. మీకు స్కాం ఆంధ్ర కావాలా లేకా స్కీం ఆంధ్ర కావాలా అని అప్పట్లో జ‌గ‌న్‌పై మోదీ విరుచుకుప‌డ్డారు. మ‌ళ్లీ 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై కూడా చాలా వివాద‌స్పద వ్యాఖ్య‌లు చేశారు మోదీ. ముఖ్యంగా పోలవరం అంశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు.

చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను ఒక ఏటీఎంలా వాడుకున్నార‌ని అప్ప‌టి ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యాఖ్య‌లు చేసి, వైసీపీకి త‌మ పార్టీ ద‌గ్గ‌ర అనే సంకేతాలు ఇచ్చారు. అయితే తాజాగా అదే మోదీ ప్ర‌భుత్వం చంద్ర‌బాబుకు పోల‌వ‌రం అంశంలో క్లీన్ చిట్ ఇవ్వ‌డం వెనుక ర‌హస్య ఎజెండా ఏంట‌నే సందేహాలు వినిపిస్తున్నాయి. ఏపీలో మళ్లీ చంద్రబాబుతో కలిసి అడుగులు వేయ‌డానికి బిజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరమేంటనేది కూడ ఇక్కడ ముఖ్యంగా చర్చించాల్సిన మరో అంశం. ఇప్ప‌టికే సీఎం జగన్‌కు బిజేపీతో మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌య‌నే సంకేతాలు ఆ పార్టీ నేత‌లు ఒక వైపు ఇస్తున్న త‌రుణంలో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ బాబుకు అనుకూలంగా ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురయింది జగన్ టీమ్.

ఒక వైపు ర‌ఘురామ‌కృష్ణ రాజు మ‌రోవైపు ఈ ప‌రిణ‌ామంతో అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే ఆందోళ‌న‌లో వైసీపీ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. బిజేపీ మాత్రం తాము రెండు పార్టీల‌కు స‌మ‌దూరం అనే సంకేతాలే ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఐనప్పటికీ ఇటు టీడీపీ గానీ.. అటు వైసీపీ గానీ.. బిజేపీ మాకు ప్ర‌త్య‌ర్ధి పార్టీ అని చెప్పే ప‌రిస్థితిల్లో లేవు. అప్పుడప్పుడు త‌ప్పనిస‌రి ప‌రిస్థితిల్లో వ్య‌తిరేక కామెంట్స్ చేసినా.. పార్ల‌మెంట్‌లో ఏమైనా కీల‌క బిల్లుల ఆమోద స‌మ‌యంలో ఈ రెండు పార్టీలు బిజేపీ వైపే ఉంటూ వ‌స్తున్నాయి. అయితే తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో బిజేపీ ఒక కొత్త వ్యూహాన్ని ఏపీపై అమలు చేయ‌డానికి రెడీ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మ‌ల‌సీతారామ‌న్, రామ్ మాద‌వ్ పార్టీ వర్చువల్ ర్యాలీ సమయంలో వైసీపీకి వ్య‌తిరేకంగా చేసిన వ్యాఖ‌లు మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతున్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు టీడీపీ, బిజేపీ మ‌ళ్లీ క‌లుస్తున్నాయని చెప్ప‌లేక‌పోయినప్పటికి ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో బిజేపీ చాప‌కింద నీరులా త‌మ వ్యూహాన్ని అమ‌లు చేసే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
First published: June 29, 2020, 6:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading