news18-telugu
Updated: January 2, 2020, 5:15 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో రాజధాని మార్పు అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. దీనిపై వైసీపీ, టీడీపీలు ఇప్పటికే తమ వైఖరి స్పష్టం చేశాయి. జనసేన పార్టీ అధినేత పవన్ ఈ అంశంపై పార్టీ పరంగా ఓ కమిటీ వేశారు. అయితే ఆయన మాటలను బట్టి...ఆయన కూడా అమరావతి వైపే మొగ్గుచూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై బీజేపీ అధికారిక వైఖరి ఏమిటనే అంశంపై మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు. సుజనా చౌదరితో పాటు రాష్ట్రంలోని బీజేపీ నేతల్లో ఎక్కువమంది అమరావతికే జై కొడుతుండగా... రాష్ట్ర రాజధానితో తమకు సంబంధం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు కుండబద్ధలు కొట్టారు. దీంతో అసలు అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో బీజేపీ వైఖరి ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ నెల 4న కడపకు రానున్న ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా... ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పరిణామాలను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్ఠానం సునిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో వివిధ నేతల అభిప్రాయాలు, నివేదికలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాకు అందాయని ఆ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP Telangana/Twitter)
ప్రధాని మోదీ స్వయంగా రాజధానికి శంకుస్థాపన చేయడం, కేంద్రం ఇప్పటివరకు రూ.2,500 కోట్లు ఇవ్వడం, రింగ్‌రోడ్, ఎక్స్‌ప్రెస్ హైవేలకు ఆర్థిక సాయం, వివిధ ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం, హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం.. ఇన్ని జరిగిన తర్వాత రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోవడం సరైంది కాదని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నడ్డా పర్యటనలో రాజధాని మార్పు, అమరావతిపై స్పష్టమైన వైఖరి ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
Published by:
Kishore Akkaladevi
First published:
January 2, 2020, 5:15 PM IST