news18-telugu
Updated: May 21, 2020, 6:37 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీపీ సుకన్య మధ్య వాగ్వాదం
రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా క్షేత్రస్థాయిలోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య వివాదం నెలకొన్న ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో చోటు చేసుకుంది. రోడ్డు పనుల శంకుస్థాపనకు తనకు సమాచారం ఇవ్వలేదని స్థానిక బీజేపీ ఎంపీపీ నిరసన వ్యక్తం చేశారు. యాచారం మండలం నందివనపర్తి వద్ద రూ. 23 కోట్లతో నిర్మించనున్న 5.7కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
అయితే తనకు సమాచారం ఇవ్వలేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేని నిలదీశారు యాచారం ఎంపీపీ సుకన్య. సమాచారం అందుకుని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన తనను ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్మెల్యేను ఆమెను నిలదీశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తన చేయి పక్కకు లాగి ఎమ్మెల్యే మంచిరెడ్డి కొబ్బరికాయ కొట్టాడని ఎంపీపీ సుకన్య ఆరోపించారు. తనను బలవంతంగా పోలీసులు పక్కకు లాక్కెళ్లి, నిరసనల మద్యే రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారని ఆమె మండిపడ్డారు. ఇందుకు నిరసనగా యాచారం చౌరస్తాలో ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. దళిత మహిళ అయిన ఎంపీపీ చేతిపై ఎమ్మెల్యే కొబ్బరి కాయ కొట్టారని ఆమె మద్దతుదారులు ఆరోపించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
May 21, 2020, 6:33 PM IST