ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి కేంద్రం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరే అందుకు నిదర్శనం. ఓ ఛానల్‌తో మాట్లాడిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు.. మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారమే ప్రక్రియను ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు. ఆలస్యం చేయడం, తొందరగా పూర్తి చేయడం లాంటివేవీ ఉండవని అన్నారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు. వ్యవస్థకు లోబడే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. రైతుల అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తే కేంద్రం కచ్చితంగా స్పందిస్తుందని తెలిపారు. 169(1) ప్రకారం అసెంబ్లీ.. తీర్మానాన్ని చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప తాము చేసేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు.
కొందరు కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఈ అంశంలో రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తామని జీవీఎల్ తెలిపారు. తమ పార్టీకి మంచి జరుగుతుందనో, చెడు జరుగుతుందనో చూడటం లేదని.. రాజ్యాంగం ఏది చెబితే దాని ప్రకారం కేంద్రం అడుగులు వేస్తుందని ఆయన వివరించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:January 29, 2020, 13:47 IST