హోమ్ /వార్తలు /National రాజకీయం /

BJP MLA ఈటల రాజేందర్ తొలిరోజే చెప్పేశారు -KCR ఆయుధంతోనే TRSకు చెక్ పెట్టేలా

BJP MLA ఈటల రాజేందర్ తొలిరోజే చెప్పేశారు -KCR ఆయుధంతోనే TRSకు చెక్ పెట్టేలా

హుజూరాబాద్ గెలుపు తర్వాత ఈటల ప్రెస్ మీట్

హుజూరాబాద్ గెలుపు తర్వాత ఈటల ప్రెస్ మీట్

తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టంగా భావిస్తోన్న హుజూరాబాద్ ఫలితాల తర్వాత బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల ఏం చేయబోతున్నారు? అధికార టీఆర్ఎస్ ను తిప్పలు పెట్టడానికి ఆయన దగ్గరున్న అస్త్రాలేంటి? ప్రతిష్టాత్మక దళిత బంధు పథకాన్నే కేసీఆర్ పైకి ఆయుధంగా వాడబోతున్నారా?

ఇంకా చదవండి ...

ఒకప్పుడు కేసీఆర్ కుడిభుజం.. ఉద్యమం, పాలనలో రెండు దశాబ్దాల ప్రయాణం.. కల్వకుంట్ల కుటుంబీకులు ఎంతమంది ఉన్నా టీఆర్ఎస్ లో దాదాపు నంబర్-2 స్థానం.. గులాబీ జెండాకు ఓనర్లం కూడా తామేనన్న ధిక్కారస్వరం.. సీన్ కట్ చేస్తే.. భూకబ్జా ఆరోపణలపై తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్.. వరుస కేసుల దెబ్బతో టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిక.. తాను రాజీనామా చేసి తిరిగి పోటీచేసిన హుజూరాబాద్ లో మళ్లీ గెలుపు.. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ కాస్తా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అయిపోయారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టంగా భావిస్తోన్న హుజూరాబాద్ ఫలితాల తర్వాత బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల ఏం చేయబోతున్నారు? అధికార టీఆర్ఎస్ ను తిప్పలు పెట్టడానికి ఆయన దగ్గరున్న అస్త్రాలేంటి? అనే ప్రశ్నలకు స్వయంగా ఆయనే సమాధానాలు చెప్పారు. హుజూరాబాద్ లో విజయం సాధించిన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు..

దళిత బంధునే ఆయుధంగా?

హోరాహోరీగా సాగుతుందనుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ ఫలితాల్లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ దాదాపు సునాయాసంగా గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్‌పై ఏకంగా 24,068 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఈట‌లకు 1,06,780 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్య‌ర్థికి 82,712 ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్‌కు 3,012 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ది కోసమే ప్రతిష్టాత్మక దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చానని సీఎం కేసీఆర్ చెప్పడం, ఈసీకి ఫిర్యాదుతో ఆ పథకం నిలిచిపోవడానికి మీరంటే మీరే కారకులంటూ బీజేపీ, టీఆర్ఎస్ గొడవ పడిన నేపథ్యంలో ఆ పథకం భవితవ్యం ఏమిటనేదానిపై లోతైన చర్చ సాగుతోంది. హుజూరాబాద్ ఫలితాల తర్వాత దళిత బంధు ఆగుతుందనే ప్రచారానికి చెక్ పెడుతూ, ఆ పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేస్తామని కేసీఆర్ మాటిచ్చారు. సరిగ్గా ఆ మాటను, దళిత బంధు పథకాన్నే కేసీఆర్ పైకి ఆయుధంగా వాడబోతున్నట్లు ఈటల హింట్ ఇచ్చారు..

ఎప్పటికీ ఉద్యమ బిడ్డగానే..

హుజూరాబాద్ గెలుపు తర్వాత తొలిసారి స్పందించిన ఈటల దళిత బంధుపై కీలక కామెంట్లు చేశారు. దళిత బంధు హుజురాబాద్‌లో అందరికి అమలు చేయాలని, తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని, పేదరికంలో ఉన్న వారందరికీ దళిత బంధు లాంటి పథకాలను ప్రశపెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల డిమాండ్ చేశారు. అలాగే, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్దిదారుల సొంత స్థలాల్లోనే కట్టివ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని, రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ భృతి చెల్లించాలని కేసీఆర్ సర్కారును ఈటల డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర్హులైన అందరికీ పింఛన్లు అందివ్వలని, రైతాంగం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న ఈటల.. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై అందరితో కలిసి పోరాటం చేస్తానని, ఎన్నటికీ తాను ఉద్యమ బిడ్డగానే ఉంటానని అన్నారు.

కేసీఆర్ పై ఢిల్లీకి ఫిర్యాదు

హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ డబ్బు, మద్యం విచ్చలవిడిగా వెదజల్లిందని, అయితే, ప్రభుత్వ దౌర్జన్యాన్ని కేసీఆర్ అహంకారాన్ని హుజురాబాద్ ప్రజలు పాతరేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేదని, ప్రతి కుటుంబాన్ని టీఆర్ఎస్ వేధించినా ప్రజలు తన వైపు నిలిచారని చెప్పారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్నికల నిబంధనలు పట్టించుకోలేదని, పోలీసులే దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలు, ప్రభుత్వ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేస్తామని, రాబోయే కాలంలో ఇలాంటి సంప్రదాయం ఉండకూడదని కోరుకుంటున్నానని ఈటల రాజేందర్ చెప్పారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Etela rajender, Huzurabad, Huzurabad By-election 2021, Trs

ఉత్తమ కథలు