హుజూరాబాద్‌లో విజయం సాధించిన తరువాత మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కావడంతో.. ఆ పార్టీ ఆదేశాల మేరకు ఆయన నడుచుకోవాల్సి ఉంటుందనే విషయం వేరే చెప్పనవసరం లేదు. కానీ కొంతమంది విషయంలో మాత్రం ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారనే విషయం ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. దీంతో వారిని ఆయన ఏ రకంగా టార్గెట్ చేయబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే తనను హుజూరాబాద్‌లో ఓడించేందుకు కష్టపడిన కొందరు టీఆర్ఎస్ నేతలను వారి వారి నియోజకవర్గాల్లో టార్గెట్ చేసేందుకు ఈటల రాజేందర్ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి వంటి వాళ్లు ఉన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
హుజూరాబాద్‌లో గెలిచిన తరువాత తన నియోజకవర్గంలో కొందరు పెన్షన్లు సహ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారని.. అలాంటప్పుడు వారి నియోజకవర్గంలోనూ అవన్నీ జరిగేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఆయన వారి నియోజకవర్గాల్లో నేరుగా పర్యటించడమో లేక తెరవెనుక మంత్రాంగం నడిపించడమో చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సిద్ధిపేటలో దళిత గర్జన ఏర్పాటు చేస్తానని.. దానికి తానే నాయకత్వం వహిస్తానని ఈటల రాజేందర్ అన్నారు. అలా హరీశ్ రావుపై రివెంజ్ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నానని సంకేతాలు ఇచ్చారు.
హరీశ్ రావుతో పాటు మరికొందరి విషయంలోనూ ఈటల రాజేందర్ ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే గతంలో తనను ఓడించేందుకు ప్రయత్నించిన చంద్రబాబుకు కేసీఆర్ ఏ విధంగా అయితే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కామెంట్ చేశారో.. ఈటల రాజేందర్ కూడా అదే రకంగా తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విషయాన్ని సీరియస్‌గా ఆలోచిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
త్వరలోనే తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. బీజేపీ ఎమ్మెల్యే జోస్యం
టీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఆ నేతకు కూడా ‘హుజూరాబాద్’ పెద్ద దెబ్బ.. ఇమేజ్‌కు డ్యామేజ్ ?
హుజూరాబాద్‌లో విజయం సాధించడం ద్వారా రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్, హరీశ్ రావులకు తాను ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకున్న ఈటల రాజేందర్.. బీజేపీలో ఉంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి రాజకీయంగా తనను కేసీఆర్ అవమానించారనే భావనలో ఉన్న ఈటల రాజేందర్.. ఆయనపై రివెంజ్ తీర్చుకోవడానికి ముందు కొందరు టీఆర్ఎస్ నేతలపై ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Etela rajender, Harish Rao, Huzurabad