BJP MAY FIELD VIJAYASHANTI IN NAGARJUNA SAGAR BY POLLS TO COUNTER CONGRESS TRS AK
నాగార్జునసాగర్‌పై బీజేపీ కొత్త ప్లాన్.. కాంగ్రెస్, టీఆర్ఎస్కు ధీటుగా..
ప్రతీకాత్మక చిత్రం
Vijayashanti Nagarjuna Sagar By Election: నాగార్జునసాగర్ బరిలో కాంగ్రెస్ తరపున బలమైన జానారెడ్డి ఉండటం.. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు ఇది సిట్టింగ్ సీటు కావడంతో.. ఇక్కడ రెండు పార్టీలకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.
తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ అంతా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల మీదే ఉంది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిపికేషన్ రావడానికి ముందే అభ్యర్థిని ఖరారు చేసుకుని బరిలోకి దింపాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూర్తి క్లారిటీతో ఉందని.. తమ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇక టీఆర్ఎస్ తరపున ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయిన నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు సీటు ఇస్తారా ? లేక మరొకరిని తెరపైకి తీసుకొస్తారా ? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇక తెలంగాణలో మంచి ఊపు మీదున్న బీజేపీ ఇక్కడ ఎవరిని బరిలోకి దింపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన నివేదితా రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం నాగార్జునసాగర్ అభ్యర్థి విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్ బరిలో కాంగ్రెస్ తరపున బలమైన జానారెడ్డి ఉండటం.. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు ఇది సిట్టింగ్ సీటు కావడంతో.. ఇక్కడ రెండు పార్టీలకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది.
ఈ క్రమంలోనే పాపులర్ నాయకురాలైన విజయశాంతి పేరును బీజేపీ పరిశీలిస్తోందని సమాచారం. కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విజయశాంతి సేవలను వాడుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఆమెను నాగార్జునసాగర్ బరిలోకి దింపాలని యోచిస్తోందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరికీ తెలిసిన అభ్యర్థి బరిలో ఉంటేనే తమకు మంచి ఫలితాలు వస్తాయని.. కాంగ్రెస్, టీఆర్ఎస్లకు గట్టి పోటీ ఇచ్చినవాళ్లమవుతామని బీజేపీ భావిస్తోంది.
విజయశాంతి (ఫైల్)
ఈ కారణంగానే ప్రజాదరణ పొందిన విజయశాంతిని నాగార్జునసాగర్ బరిలో ఉంచాలని బీజేపీ భావిస్తోందని.. ఇదే విషయమై ఆ పార్టీ అధిష్టానంతోనూ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. మొత్తానికి బీజేపీలో చేరిన తరువాత అధికార టీఆర్ఎస్పై మాటల దాడిని తీవ్రతరం చేసిన విజయశాంతి.. సాగర్‌లో కమలదళం తరపున పోటీ చేసేందుకు సై అంటారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయశాంతి బీజేపీ తరపున సాగర్ బరిలోకి దిగితే మాత్రం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక దుబ్బాక తరహాలో రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.