news18-telugu
Updated: January 9, 2020, 5:27 PM IST
జేపీ నడ్డాను అభినందిస్తున్న అమిత్ షా (Image:ANI)
భారతీయ జనతా పార్టీకి త్వరలో జాతీయ అధ్యక్షుడు మారబోతున్నట్టు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ నెలాఖరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆ సమావేశాల్లోనే అమిత్ వారసుడిని ప్రకటించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. ఆయన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. జాతీయ అధ్యక్షుడితోపాటు రాష్ట్రాల్లో అధ్యక్షులను కూడా మార్చనున్నట్టు సమాచారం. సుమారు 50 శాతం రాష్ట్రాల్లో కొత్త వారికి పగ్గాలు అప్పగించనున్నట్టు తెలిసింది. ఈ వారాంతంలోనే రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి జాబితా సిద్ధం చేస్తారు. జాతీయ అధ్యక్షుడి ఎన్ని తర్వాత కొత్తగా వచ్చే ప్రెసిడెంట్ రాష్ట్రాల అధ్యక్షుల జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోపు అవి పూర్తికానున్నాయి.
బీజేపీ రాజ్యాంగం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అవ్వాలంటే కనీసం 15 సంవత్సరాల పాటు క్రియాశీలక సభ్యుడై ఉండాలి. ఆ తర్వాత రాష్ట్ర పార్టీకి చెందిన 20 మంది ఎలక్టోరల్ కమిటీ వారి పేరును జాతీయ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తుంది. కనీసం ఐదు రాష్ట్రాల నుంచి అలాంటి ప్రతిపాదన రావాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లు.
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతలకు సీఏఏ నిరసన సెగలు తగులుతున్నాయి. అంతేకాకుండా, ఇటీవల జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చెందింది. మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు సంపాదించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ సమయంలో కొత్త అధ్యక్షుడు ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 9, 2020, 5:27 PM IST