మహారాష్ట్ర, హర్యానాలో మరోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని... దాదాపు అన్ని మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దేశంలో యూపీ తరువాత ఆ స్థాయిలో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే మహారాష్ట్రలో ఈ సారి బీజేపీ, శివసేన కూటమి ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితాల కౌంటింగ్ సరళిని బట్టి బీజేపీ కూటమి మహారాష్ట్రలో 200 సీట్లలో పాగా వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినట్టుగానే... ఈ సారి కూడా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి భారీ పరాజయాన్ని మూటగట్టుకునేలా ఉంది. ఇక హర్యానాలోనూ బీజేపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తం 90 స్థానాలున్న హర్యానాలో 75 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ... ఆ మార్క్ చేరుకుంటుందా లేదా అన్నదే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఫలితాల సరళిలో బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక తెలంగాణలోని హుజూర్ నగర్లోనూ ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్‌పై ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తున్న టీఆర్ఎస్ నాలుగో రౌండ్ ముగిసే సమయానికి 8 వేలకు పైగా మెజార్టీతో కొనసాగుతోంది. గౌరవప్రదమైన మెజార్టీతో హుజూర్ నగర్ సీటును గెలుచుకుంటామని అంచనా వేసిన టీఆర్ఎస్... ప్రస్తుతానికి ఆ దిశగానే ముందుకు సాగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.