తెలంగాణలో రాజకీయంగా ఎదుగుతోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఓ వైపు అధికార టీఆర్ఎస్పై రాజకీయంగా పోరాటం చేస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలోకి తీసుకుని.. పార్టీ బలహీనంగా చోట బలపడేందుకు వ్యూహరచన చేస్తోంది. అయితే ఈ క్రమంలో ఆ పార్టీలోనూ కొన్ని అసంతృప్తి స్వరాలు వినిపించడం మొదలుపెట్టాయి. పార్టీలోకి కొత్త నేతలు వస్తున్న తరుణంలో.. ఎప్పటి నుంచో ఉన్న తమకు ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు రహస్యంగా సమావేశాలు నిర్వహించుకోవడం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని అసంతృప్తి నేతలు మొదటగా సమావేశాలు నిర్వహించుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు.
కరీంనగర్, నిజామాబాద్ తరువాత పలువురు ఇతర జిల్లాల నేతలు కూడా ఈ రకమైన సమావేశాలు పెట్టుకోవడం.. ఆ తరువాత తమ జిల్లాలోని ఈ రకమైన రహస్య భేటీలు ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ బీజేపీలో కలకలం రేపింది. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ నాయకత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. పార్టీకి నష్టం చేస్తున్న కొందరు నేతలపై వేటు వేసేందుకు కూడా బీజేపీ నాయకత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో బీజేపీ ఎవరిపై వేటు వేస్తుందనే అంశంపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈ రహస్య సమావేశాలపై తెలంగాణ బీజేపీ నాయకత్వం ఇంత సీరియస్గా ఉండటానికి చాలా కారణాలే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల్లోని అనేక నేతలు బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ భావిస్తోంది. అదే జరిగితే.. ఈ రకమైన అసంతృప్తులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన అసంతృప్తి నేతలను ముందుగానే కట్టడి చేయడం వల్ల.. భవిష్యత్తులో నేతలు ఈ రకమైన దారిలోకి వెళ్లకుండా ఉండేందుకు వీలు కలుగుతుందని పార్టీ భావించి ఉండొచ్చని కొందరు చర్చించుకుంటున్నారు.
బీజేపీ రహస్య భేటీలపై సీరియస్గా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. పార్టీ క్రమశిక్షణను అంతా కచ్చితంగా పాటించాలనే నిబంధనలు బీజేపీలో ఎక్కువ. ఎవరైనా పార్టీ తరువాతే అనే విధానాన్ని బీజేపీ గట్టిగా ఫాలో అవుతుంది. పార్టీ వ్యతిరేక చర్యలను బీజేపీ ఏ మాత్రం ఉపేక్షించదు. అందుకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకపోయినా.. అసంతృప్తిని కూడా తాము సహించబోమని బీజేపీ తమ నేతలకు గట్టిగా చెప్పాలని నిర్ణయించుకుంది.
అందుకే ఈ రకమైన రహస్య సమావేశాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా మిగతా నేతలు దారికి వస్తారని అంచనా వేస్తోంది. అంతేకాదు ఈ రకమైన సమావేశాలు నిర్వహిస్తున్న వాళ్లు ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు వ్యతిరేకంగా ఉండటం కూడా బీజేపీ నాయకత్వం ఇంత సీరియస్గా ఉండటానికి మరో కారణమైంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కొందరు బీజేపీ నేతలు రహస్య సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.