కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి గ్యారెంటీ..? బండి సంజయ్‌కి..

Lok Sabha Elections 2019: బీజేపీ పుంజుకోవడానికి దక్కిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వదులుకోరు. కాబట్టి కిషన్ రెడ్డికి లేదా బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 5:23 PM IST
కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి గ్యారెంటీ..? బండి సంజయ్‌కి..
బండి సంజయ్, కిషన్ రెడ్డి (ఫైల్)
  • Share this:
తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా నాలుగు స్థానాలను దక్కించుకోబోతోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్ ఇప్పటికే విజయం సాధించగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి 62,960 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, బీజేపీ కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి.. బండారు దత్తాత్రేయకు బదులుగా బరిలోకి దిగారు. తన ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నా చివరికి విజయం సాధించారు. ఇప్పుడు ఆ విజయమే కిషన్ రెడ్డిని కేంద్రంలో కూర్చోబెడుతుందా? ఆయనకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందా? కేంద్ర మంత్రి అవడం ఖాయమేనా? అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అదే విధంగా, యువకులకు అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తే కిషన్ రెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లేకపోతే, యువతను ఆకర్షించి కరీంనగర్‌ లోక్‌సభ నుంచి గెలుపొందిన బండి సంజయ్‌కి కూడా కేంద్రమంత్రి పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సంజయ్ వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపవచ్చని కూడా అంటున్నారు.

తెలంగాణలో బలపడేందుకు బీజేపీకి మంచి అవకాశం దక్కింది. ఊహించని విధంగా ఆ పార్టీకి రెండు సీట్లు బోనస్‌గా కలిసి వచ్చినట్లే. రెండు సీట్లు మాత్రమే గెలుస్తుందని భావించినా.. నాలుగు సీట్లు రాబట్టుకునే దశలో ఉంది. పార్టీ పుంజుకోవడానికి దక్కిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షా వదులుకోరు. కాబట్టి కిషన్ రెడ్డికి లేదా బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కిషన్ రెడ్డికి 42.3 శాతం ఓట్లు దక్కగా, సాయికిరణ్‌కు 34.9 శాతం, అంజన్ కుమార్ యాదవ్‌కు 18.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, ఈసారి కిషన్ రెడ్డి గెలవడం, కేంద్రంలో కూడా బీజేపీ అధికారాన్ని చేపట్టనుండడంతో మరోసారి సికింద్రాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంది. గతంలో కూడా 2014లో బండారు దత్తాత్రేయ ఈ స్థానం నుంచి గెలవగా, కేంద్రంలో బీజేపీ సర్కార్, 2004, 2009లో అంజన్ కుమార్ యాదవ్ గెలవగా కేంద్రంలో UPA సర్కార్ ఏర్పడ్డ విషయం తెలిసిందే.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 23, 2019, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading