అమలాపురంలో టెన్షన్..టెన్షన్.. బీజేపీ నేతలు అరెస్ట్.. షాపులు బంద్

విష్ణువర్ధన్ రెడ్డి

నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉన్నా, ఏ విధమైన ఆయుధాలు కలిగి ఉన్నా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ హెచ్చరించారు

 • Share this:
  తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమలాపురంలోని ఆర్డీవో  కార్యాలయ ముట్టడికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమ్యారు. నేతలు ఆర్డీవో  కార్యాలయానికి వెళ్లకుండా అర్ధరాత్రి నుంచే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బీజేపీ నేతలను నిర్బంధిస్తున్నారు. ఐతే పోలీసుల కళ్లు గప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అమలాపురం చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను రాత్రంతా కారులోనే తిప్పినట్లు సమాచారం. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర సహాయమంత్రి హోదా కలిగిన తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని మండిపడ్డారు.

  అటు విజయవాడ నుంచి అమలాపురానికి బయలుదేరిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు భద్రత పెంచారు. వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు చేపట్టారు.

  అంతర్వేది ఘటనపై ప్రశ్నించినందుకు బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఐతే అమలాపురం డివిజన్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా ఉన్నా, ఏ విధమైన ఆయుధాలు కలిగి ఉన్నా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు బయట ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తారన్న అనుమానంతో వ్యాపారులు స్వచ్ఛందగా షాపులు మూసివేశారు.
  ఏపీలో అంతర్వేది రథం దగ్ధం, ఇంద్రకీలాద్రిపై వెండి సింహాలు మాయంతో పాటు పలు చోట్ల దేవుళ్ల విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. జగన్ హయాంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అంతర్వేది ఘటనను సీరియస్‌తా తీసుకున్న బీజేపీ శ్రేణులు చలో అంతర్వేది పిలుపునిచ్చి ఆందోళనలు నిర్వహించారు. హిందూ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంతర్వేదిలో నిరసనలు చేపట్టారు.
  Published by:Shiva Kumar Addula
  First published: