గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ప్రచారంలోకి అగ్రనేతలను దింపుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర నేతలు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే తొలిదశలో బీజేపీ యువ ఎంపీ తేజస్వి యాదవ్ హైదరాబాద్‌కు వచ్చి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పెద్దలు రానున్నారు. ఎన్నికల ప్రచారానికి కేవలం నవంబర్ 29 వరకే గడువు ఉంది. అంటే కేవలం ఇంకా 5 రోజులే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు వరుసగా హైదరాబాద్‌కు క్యూ కట్టనున్నారు. అందరు నేతలు ఒకే రోజు కాకుండా, రోజుకో నేత ప్రచారానికి రానున్నట్టు తెలిసింది. చివరి ఘట్టంలో అమిత్ షా ప్రచారానికి రానున్నట్టు సమాచారం. ఎన్నికలకు రెండు రోజుల ముందు అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించి ప్రచారం చేస్తే ఆ జోష్ హైలో ఉంటుందని, అది ఎన్నికలకు పనికొస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి జోష్ మీద ఉన్న బీజేపీ ఆ జోష్‌ను గ్రేటర్లో కూడా కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శల దాడి పెంచుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలను కూడా బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని కమలనాధులు భావిస్తున్నారు. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన భూపేంద్ర యాదవ్ రంగంలోకి దిగి మొదటిదశలో పరిస్థితిని చక్కబెట్టారు. ఆ తర్వాత మరికొందరు పెద్దలు రంగంలోకి దిగనున్నారు.
గ్రేటర్ ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో పొంతన లేని విధంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన హామీలనే కేసీఆర్ మరో మారు ప్రకటించారని చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో కొత్త దనం ఏదీ లేదన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదన్నారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోనే అక్షరం పొల్లుబోకుండా మళ్లీ 2020లో కూడా ఇచ్చారని ఎద్దేవా చేశారు. కనీసం మొదటి పేజీ ఫొటో, లోపల అక్షరాలు కూడా మారలేదన్నారు. టీఆర్ఎస్ మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు. తాగునీటి అవసరాలు తీరుస్తానని ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పారే కేసీఆర్‌కే గుర్తు లేదన్నారు.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతును బీజేపీకి ప్రకటించింది. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకూడదని, బీజేపీకి వేయాలని జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మహానగరం అభివృద్ది కోసం, దీర్ఘకాల ప్రయోజనాల కోసం జనసేన పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించారు.
అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు, గ్రేటర్ మీద కమలం జెండా ఎగరేసేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకు తగ్గట్టు అవసరమైనంత మేర పార్టీ పెద్దల సలహాలు, సూచనలతో పాటు సాయం కూడా తీసుకుంటున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఏకంగా అమిత్ షాను కూడా తీసుకురావాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.