హరీశ్,ఈటలను గెంటేశారు.. కేసీఆర్‌పై వివేక్ తీవ్ర విమర్శలు..

గడ్డం వివేకానంద్(Image : Facebook)

తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి పనిచేసిన హరీశ్ రావు,ఈటల రాజేందర్‌లను కేసీఆర్ పార్టీ నుంచి గెంటేశారని వివేక్ విమర్శించారు. కేటీఆర్,కవితల సారథ్యంలో కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నాడన్నారు.

  • Share this:
    ఇటీవల హుజురాబాద్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ప్రతర్థి పార్టీలకు అస్త్రాన్ని ఇచ్చినట్టయ్యాయి. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు నిజంగానే కుట్ర జరిగిందో లేదో తెలియదు కానీ.. ఆయన వ్యాఖ్యలు కేసీఆర్‌ను టార్గెట్ చేయాలనుకునేవారికి కలిసొచ్చాయి. తాజాగా బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

    తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి పనిచేసిన హరీశ్ రావు,ఈటల రాజేందర్‌లను కేసీఆర్ పార్టీ నుంచి గెంటేశారని విమర్శించారు. కేటీఆర్,కవితల సారథ్యంలో కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నాడన్నారు. అందుకోసం సొంత పార్టీ నేతల గొంతు కోసేందుకు కూడా వెనుకాడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. కాళేశ్వరం నీటిని మొదట పెద్దపల్లి జిల్లాకు మళ్లించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు.

    ఇదిలా ఉంటే, ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. సౌమ్యుడిగా,పార్టీకి విధేయుడిగా పేరున్న రాజేందర్ లాంటి నేత.. గులాబీ జెండాకు తామే ఓనర్లం అని మాట్లాడేంత పరిస్థితి ఎందుకొచ్చిందని చాలామంది చర్చించుకుంటున్నారు. పత్రికలల్లో వండి వార్చిన కథనాలతో ఈటలకు పొమ్మన లేక పొగబెడుతున్నారు కాబట్టే ఆయన అంతలా బాధపడ్డారనేవారు కొందరైతే.. అలాంటిదేమీ లేదనేది గులాబీ నేతల వాదన. ఇప్పటికైతే ఈ వ్యవహారం సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా  మున్ముందు ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
    First published: