సింగరేణిని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింగరేణిలో పెత్తనం చలాయిస్తూ అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కోట్ల రూపాయల ఆదాయ గల సింగరేణిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. సింగరేణికి యూనియన్ లీడర్‌గా మారిన కవిత.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. సింగరేణి అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. సింగరేణి సీఎండీపైనా తరుణ్ చుగ్ మండిపడ్డారు. ఆయన టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు.
మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్‌లో ఆయన పర్యటించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు. త్వరలో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రానుందని తరుణ్ చుగ్ జోస్యం చెప్పారు. దోపిడీ దొంగలను బీజేపీ ఎప్పడూ వదిపెట్టదని.. కవితకు తాను ఇచ్చే మెసేజ్ ఇదొక్కటేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. నేరస్థులకు కొమ్ముకాస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేరోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
దేశాభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరినీ బీజేపీలోకి స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాగజ్ నగర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ పేరు వింటేనే కేసీఆర్‌కు భయం పెరుగుతోందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాక్షస, గడీల పాలనకు అంతమొందించాలన్నారు. తెలంగాణలో నిద్రలేని జీవులు ఇద్దరున్నారని, వారిలో ఒకరు కేసీఆర్, ఇంకొకరు కేటీఆర్ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ నిద్రలో లేచి సీఎం.. సీఎం అంటున్నాడని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాబోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవరన్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:February 23, 2021, 15:50 IST