వ్యక్తిగత కారణాలు గానీ, మరే కారణమైనా గానీ... ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దూరంగా ఉండిపోయారు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. నిజానికి ఐదేళ్ల మోదీ పాలనలో తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. అమెరికాతో సంబంధాలు, గల్ఫ్‌లో భారతీయులకు రక్షణ అంశాలు, ఐక్యరాజ్యసమితిలో భారత వాణి వినిపించడంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి... యోగా డే వచ్చేలా చెయ్యడంలో సుష్మస్వరాజ్ పాత్ర ఎంతో ఉంది. మొత్తంగా పాజిటివ్ మార్కులు తెచ్చుకున్న ఆమె... రెండోసారి మోదీ ప్రభుత్వంలో లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచే అంశం. అయినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు ఉండేలా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా... అక్కడ కొత్త గవర్నర్‌ను నియమించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆ పదవికి సుష్మస్వరాజ్ అయితే చక్కగా సెట్ అవుతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఐతే... సుష్మ లాగే... లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలవలేదు. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్ ఇవ్వకూడదన్న బీజేపీ కండీషన్ వల్ల సుమిత్ర పోటీ అవకాశం కోల్పోయారు. వాళ్లిద్దరీ సముచిత గౌరవం ఇవ్వాలన్న నిర్ణయంతో గవర్నర్లుగా నియమిస్తే బాగుంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్ల బీజేపీ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ... మున్ముందు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లే అవకాశం ఉందనీ, అలాంటి సమయంలో... ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టేందుకు ప్రత్యేకంగా గవర్నర్ ఉండాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే... త్వరలోనే సుష్మస్వరాజ్ ఏపీలో గవర్నర్‌గా అడుగుపెట్టే అవకాశాలున్నాయి.
Published by:Krishna Kumar N
First published:June 10, 2019, 13:11 IST