• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • BJP LEADER RAKESH PANDITA SHOT DEAD BY MILITANTS IN PULWAMA JAMMU AND KASHMIR WOMAN SUFFERS SEVERE INJURY SK

BJP Leader Murder: బీజేపీ నేత దారుణ హత్య... పట్ట పగలే తుపాకీతో కాల్పులు

రాకేశ్ పండిత (ఫైల్ ఫొటో)

కొన్ని రోజులుగా కాశ్మీర్‌లోని బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. పక్కా ప్లాన్‌తో వారిని హత్య చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది బీజేపీ నేతలు హత్యకు గురయ్యారు.

  • Share this:
    జమ్మూకాశ్మీర్‌లో దారుణం జరిగింది. ఓ బీజేపీ నేతను ఉగ్రవాదులు దారుణ హత్య చేశారు. పట్టపగలే తుపాకితో కాల్పులు జరిపి హతమార్చారు. పుల్వామా జిల్లాలోని త్రాల్‌లో ఈ ఘటన జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్, పుల్వామా జిల్లా బీజేపీ సెక్రటరీ రాకేశ్ పండిత హత్యకు గురయ్యారు. బుధవారం ఆయన త్రాల్‌లో పర్యటిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలతో ఆయన అక్కడికక్కడే మరణించారు. కాల్పుల్లో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలించారు. కానీ అప్పటికే వారు పారిపోయారు.

    ''రాకేశ్ పండిత త్రాల్‌లోని తన స్నేహితుడు ముస్తాఖ్ భట్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆయన మిత్రుడి ఇంటి ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. ముగ్గురు మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఆయన మరణించారు. ఈ ఘటనలో ఆయన మిత్రుడి కూతురికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.'' అని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.

    రాకేశ్ పండిత శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్లు సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఐతే త్రాల్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన భద్రతా సిబ్బందిని తీసుకెళ్లలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన వెంటనే త్రాల్‌ పట్టణ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు. నిందితుల కోసం పట్టణమంతా గాలిస్తున్నారు. రాకేశ్ పండిత హత్యను బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు ఖండించారు. ఇది పరికిపంద చర్య అని.. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు ఇక సాగవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    కొన్ని రోజులుగా కాశ్మీర్‌లోని బీజేపీ నేతలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. పక్కా ప్లాన్‌తో వారిని హత్య చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది బీజేపీ నేతలు హత్యకు గురయ్యారు. రాకేశ్ పండితను హత్యచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టంచేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: